సోషల్ మీడియా పోస్టులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు : సీఎం చంద్రబాబు

సోషల్ మీడియా పోస్టులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు : సీఎం చంద్రబాబు

సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, మహిళలను టార్గెట్ చేస్తూ వికృతానందం పొందే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు  ఒక టాస్క్ ఫోర్స్  ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

 జులై 10న జరిగిన  ఏపీ కేబినెట్ భేటీలో.. సోషల్ మీడియాలో జరుగుతున్న అనుచిత పోస్టుల అంశంపై రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం, కూటమి నేతలను టార్గెట్ చేస్తూ సాగుతున్న అభ్యంతరకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని  ఈ సందర్భంగా చంద్రబాబు  స్పష్టం చేశారు.

ఈ వికృత చేష్టలకు అడ్డుకట్ట వేసేందుకు వెంటనే ఒక  టాస్క్‌ఫోర్స్ ( Task Force) ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ పోలీసు శాఖను ఆదేశించింది. ఫేక్ ఐడీల వెనుక దాక్కుని ఇతరుల ప్రతిష్టను భంగపరిచే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

 అయితే, ఇదే సమయంలో కూటమి నేతలకు సీఎం చంద్రబాబు ఒక కీలక సూచన చేశారు. వైసీపీ వాళ్లు కావాలనే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని.. ఎవరూ వారి ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మంత్రులు, నేతలు తొందరపడి స్పందించవద్దని.. కేవలం చట్టపరమైన చర్యలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.