హైదరాబాద్, వెలుగు: మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ అన్ని కారిడార్లలో 4 లక్షలమందికి పైగానే మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో కోచ్‌లోకి ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఆఫీస్‌లు, కాలేజీలకు వెళ్లి, వచ్చే టైంలో రష్ విపరీతంగా ఉంటోంది. రద్దీ కారణంగా కోచ్‌లో కాలు పెట్టలేని పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో డోర్ల దగ్గర తోపులాట జరుగుతోంది. కాగా ఈ సమస్యను అధిగమించేందుకు మెట్రో మేనేజ్ మెంట్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల స్టేషన్లలో మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ను మొదలుపెట్టింది.
డోర్ల వద్ద సిబ్బంది
ఉదయం ఏడున్నర, 8 గంటల నుంచే మెట్రో స్టేషన్లు పాసింజర్లతో కిటకిటలాడుతున్నాయి. ట్రైన్ రావడమే ఆలస్యం రద్దీ కారణంగా తోపులాట జరుగుతోంది. దీంతో మెట్రో అధికారులు ట్రైన్ డోర్ల ముందు సిబ్బందిని ఉంచుతున్నారు అధికారులు. పీక్ అవర్స్‌లో లేడీస్ కోచ్ దగ్గర లేడీ స్టాఫ్, కామన్ కోచ్‌ల దగ్గర మెన్ స్టాఫ్ ఉంటున్నారు. వీరు మైక్‌లో సూచనలు, సలహాలు చేస్తున్నారు. బ్యాగ్‌లను సీట్లలో కాకుండా కింద పెట్టాలని, దిగాల్సిన వాళ్లకి దారి ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో దిగేవారికి, ఎక్కేవారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
ఇబ్బంది తగ్గింది
రోజూ రెండు లైన్లు మారి మెట్రోలో ట్రావెల్ చేస్తుంటా. మార్నింగ్ చాలా రష్ ఉంటోంది. తోసుకుంటూ, ఒకరిమీద ఒకరు పడుతూ జర్నీ చేయాల్సి వస్తోంది. ఈ మధ్య డోర్ల దగ్గర స్టాఫ్ ఉంటున్నారు. ఒకేసారి తోసుకుంటూ లోపలికి వెళ్లకుండా ప్యాసింజర్లను వాళ్లు కంట్రోల్చేస్తున్నారు. దీంతో కొంచెం ఇబ్బంది తప్పుతోంది.
- స్వప్న, ప్యాసింజర్, ముషీరాబాద్
మరిన్ని చర్యలు తీసుకుంటాం
మెట్రో రైళ్లు మునుపటి రద్దీతో తిరుగుతున్నాయి. అందుకే ప్యాసింజర్లకు ఇబ్బంది ఎదురు కాకుండా చర్యలు చేపడుతున్నాం. ప్లాట్ ఫాం మీద స్టాఫ్ ను ఉంచి మేనేజ్ చేయిస్తున్నాం. ఎల్లో లైన్ దాటి ముందుకు వెళ్లకుండా చూస్తున్నాం. దాంతో పాటు ప్యాసింజర్లు వెంటనే కోచ్‌లోకి వెళ్లకుండా దిగే వాళ్లకు టైం ఇచ్చి ఆ తర్వాత ఎక్కేలా చూస్తున్నారు. ఇలా మరిన్ని చర్యలు తీసుకుంటాం.- మెట్రో అధికారి
సర్వీసులు పెంచాలని..
పీక్ అవర్స్‌లో సర్వీసెస్ పెంచాలని ప్యాసింజర్లు కోరుతున్నారు. మార్నింగ్, ఈవెనింగ్ ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, రాయదుర్గం, అమీర్ పేట్‌ల నుంచి నాగోల్, ఎల్ బీనగర్, మియాపూర్ రూట్లలో విపరీతంగా రద్దీ ఉంటోంది. ఇటీవల అన్ని ఆఫీస్‌లు ఓపెన్ కావడంతో ట్రావెలర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ తగ్గించాలని మెట్రో అధికారులను ప్యాసింజర్లు విజ్ఞప్తి చేయడంతో ఫ్రీక్వెన్సీని కూడా తగ్గించారు. అయినా క్రౌడ్ కంట్రోల్ కాకపోవడంతో డోర్ల దగ్గర స్టాఫ్‌ను ఉంచి పలు చర్యలు తీసుకుంటున్నారు.

