- పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చు రూ. 6 వేల కోట్లే
- కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టింది
- అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
- కృష్ణా జలాల్లో వాటా వదులుకున్నారని మంత్రి ఫైర్
- హరీశ్ రావు విమర్శలకు పాలమూరు కాంగ్రెస్ నేతలతో కలిసి కౌంటర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఫైర్ అయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, మధుసూదన్ రెడ్డితో కలిసి జూపల్లి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ సర్కార్‌పై సోమవారం అచ్చంపేటలో జరిగిన రైతు సభలో హరీశ్ రావు చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మిగులు రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. డిస్కంలను అప్పుల్లో ముంచి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మాజీ సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. ఆనాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటే.. నేడు రేవంత్ పాలనలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని జూపల్లి ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకున్నారని మండిపడ్డారు. ‘‘మీ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై కేవలం రూ. 6 వేల కోట్లు ఖర్చు పెడితే.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశాం”అని చెప్పారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడంతోనే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బరాబర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అబద్ధాలకు మారుపేరు హరీశ్ రావు..
అచ్చంపేట రైతు సభలో హరీశ్ రావు అన్నీ అబద్ధాలే మాట్లాడారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ అన్నారు. హరీశ్ రావు అబద్ధాలకు మారు పేరని, అబద్ధాలకు పేటెంట్ రైట్ బీఆర్ఎస్‌దేనని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ ఎక్కువ అన్యాయానికి గురైందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే తెలంగాణలో జల దోపిడీ ఎక్కువగా జరిగిందని ఆరోపించారు. ఎస్‌బీఐ చైర్మన్‌ను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ‘సర్’ సమావేశాల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఊర్లు పట్టుకొని తిరుగుతూ సొల్లు పురాణం వాగుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌కు మతి భ్రమించిందని, తాను మంచివాడిని కాదని ఆయనే వాస్తవాలు ఒప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ నల్లమల పులిబిడ్డ రేవంత్ రెడ్డి ముందు బీఆర్ఎస్ వాళ్లు తేలిపోతున్నారని.. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం వస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.
