అవినీతి, అసమర్థతకు కేరాఫ్​ అడ్రస్ కాంగ్రెస్: కేటీఆర్

అవినీతి, అసమర్థతకు కేరాఫ్​ అడ్రస్  కాంగ్రెస్: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్  కమిటీ అని మంత్రి కేటీఆర్  అన్నారు. అవినీతి, అసమర్థతకు కాంగ్రెస్  పార్టీ కేరాఫ్​  అడ్రస్ అని ఆయన విమర్శించారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, కాంగ్రెస్సే భారత రాబందుల పార్టీ అని ఆయన మండిపడ్డారు. ఆదివారం కాంగ్రెస్  పార్టీ ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆ పార్టీ నేత రాహుల్  గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్  పార్టీ అంటేనే స్కామ్స్ అని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన ట్వీట్  చేశారు. బీజేపీకి బీఆర్ఎస్  బీ టీమ్  కాదని, కాంగ్రెస్ కు సీ టీమ్  అంతకన్నా కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఒంటిచేత్తో ఢీకొట్టే సత్తా బీఆర్ఎస్ కు ఉందని పేర్కొన్నారు.

‘‘బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొట్టే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చేందుకు కాంగ్రెస్  కుట్రపన్నుతున్నది. వారి ప్రయత్నం మిస్ ఫైర్ అయి ముమ్మాటికీ కాంగ్రెస్సే కుప్పకూలుతుంది. రూ.లక్ష కోట్లు ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి ప్రజల్లో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు?” అని కేటీఆర్  ట్వీట్  చేశారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప కాంగ్రెస్  కానే కాదన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్ ను గెలిపించారని ఆయన వ్యాఖ్యానించారు.