అప్పులు తేవడంలో మీది ప్రపంచ రికార్డు

అప్పులు తేవడంలో మీది ప్రపంచ రికార్డు
  • 2014  హామీలు ఇంతవరకూఅమలు చేయలే
  • కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమంత్రి పొన్నం కౌంటర్
  • మీరు ఢిల్లీ చెప్పులు మోసేగులాంలు అని కామెంట్
  • చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితవు

హైదరాబాద్, వెలుగు: అప్పులు తేవడంలో, హామీలు ఎగ్గొట్టడంలో కేంద్ర ప్రభుత్వానిదే రికార్డు అని మంత్రి పొన్నం ప్రభాకర్  విమర్శించారు. అప్పులు తేవడంలో కేంద్రం ప్రపంచ రికార్డు సృష్టించిందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా ఆయన విరుచుకుపడ్డారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్  గులాములు అని కామెంట్  చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై బండి సంజయ్  చేసిన ట్వీట్ కు మంత్రి పొన్నం రీట్వీట్  చేశారు.

‘‘రైతులకు ప్రతినెలా పింఛన్, పేదలకు ఉచిత విద్యుత్, సామాన్యుల అకౌంట్లో  రూ.15 లక్షల రూపాయలు, రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు... ఇలా చెప్పుకుంటూ పోతే మీరు (కేంద్రం) ఎగ్గొట్టిన హామీలు చిన్నో పిల్లాడిని అడిగినా చెప్తాడు. మీరు తెచ్చిన రూ.150 లక్షల కోట్ల అప్పులు దేశానికి గుదిబండగా మారాయి. ఏటా మీ అప్పులకు వడ్డీలు కట్టేందుకే రూ. 11 లక్షల కోట్ల ఖర్చువుతున్నాయి. 

పదేండ్ల మీ పాలనలో విద్వేష ప్రచారం, విధ్వంస చ‌‌‌‌ర్యలు త‌‌‌‌ప్ప దేశానికి చేసింది శూన్యం” అని పొన్నం వ్యాఖ్యానించారు. పన్నులు, ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని ఆయన మండిపడ్డారు. ఆడబిడ్డల ప్రసూతి ప్రయోజనాలు, విద్యార్థుల స్కాలర్ షిప్ లు, వయోవృద్ధుల రైలు ప్రయాణ రాయితీలు, రేషన్  కార్డులు, ఎరువుల సబ్సిడీలు, గ్యాస్  సిలిండర్  సబ్సిడీలు, ఉపాధి హామీ నిధులు, ఫసల్  బీమాలో కోతలు విధించారని విమర్శించారు. 

సెస్ ల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు పెట్టారని, పెట్రో ధరలు పెంచి ప్రజలపై తీవ్రభారం మోపారని అన్నారు. కేంద్రం వైఫల్యానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలని మంత్రి ప్రశ్నించారు. అటువంటి మీరు 10 నెలల ప్రజాప్రభుత్వంపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకరావాలని బండికి మంత్రి సూచించారు. అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని మంత్రి హెచ్చరించారు.