ఈవీ వాహనాలపై ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్, లీడర్లకు లోన్లు

ఈవీ వాహనాలపై ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్, లీడర్లకు లోన్లు
  • ఆ దిశగా ప్రోత్సాహకాలు ఇస్తాం: మంత్రి పొన్నం
  • ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్, లీడర్లకు లోన్లు
  • హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే ఈవీలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడి
  • సీఎస్, డీజీపీతో కలిసి సెక్రటేరియెట్​లో ఎలక్ట్రిక్ వెహికల్స్  ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని, ఇందుకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్  పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు10 నుంచి 20 శాతం డిస్కౌంట్  ఇవ్వడంతో పాటు ప్రజా ప్రతినిధులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో కలిసి ఉద్యోగులకు ఈవీ వెహికల్స్​ను  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఈవీల వినియోగంలో తెలంగాణ.. చైనా, నార్వేతో  పోటీ పడుతున్నదని చెప్పారు. హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈవీల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, రాయితీలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. 

ఈవీలకు రోడ్  ట్యాక్స్, రిజిస్ట్రేషన్  ట్యాక్స్  వంద శాతం మినహాయింపు ఇవ్వడంతో ఇప్పటి వరకు 1,15,551ఎలక్ట్రిక్ వెహికల్స్ కు రూ.925.94 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. అయినా ఈవీలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఈవీల వినియోగం 0.60 శాతం నుంచి 1.50 శాతానికి  పెరిగిందన్నారు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వాహనం, అద్దెకు తీసుకునే వెహికిల్  కూడా ఈవీనే ఉండేలా చర్యలు తీసుకుంటామని  వివరించారు. క్యూర్  ఏరియాలో ఎలక్ట్రిక్  బస్సులనే నడిపిస్తున్నామని, డీజిల్ ఆటోలను కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ..ఈవీ పాలసీతో కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. హైదరాబాద్ సిటీని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఈవీలను ప్రభుత్వం తీసుకువస్తున్నదన్నారు.