సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని  మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నట్లు తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అమ్మవారి కరుణ ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, రైతాంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమయానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి, బోనాల ఉత్సవాలు జరుగుతున్న రాష్ట్రంలోని అన్ని  దేవాలయాల్లో మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆలయ పూజారులకు ,భక్తులకు విజ్ఞప్తి చేశారు. మంచి వర్షాలు కురిసినపుడే రైతాంగమే కాకుండా సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటాయని ఆకాంక్షించారు.