అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలి: మంత్రి సీతక్క

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలి: మంత్రి సీతక్క

ఆసిఫాబాద్/తిర్యాణి, వెలుగు:  నిరుపేద కుటుంబాలు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా పిల్లలను ప్రభుత్వ అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లోనే చేర్పించాలని రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావులు సూచించారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రం లో నిర్వహించిన ‘అమ్మ మాట–అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ బాట’ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.  మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పిల్లలే నిరుపేద కుటుంబాల నిజమైన ఆస్తి అని అన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి యూనిఫాంలు, ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.

బాధిత కుటుంబాలకు మంత్రుల పరామర్శ

 ఇటీవల పిడుగుపాటుకు మృతి చెందిన చెలిమెల కోలాం గూడా గ్రామానికి చెందిన టేకం భీము, రాజుభాయి దంపతుల కుటుంబాన్ని  మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు సోమవారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సాయంగా రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా మంజూరు చేయడంతో పాటు పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  అనంతరం కొలాం గూడెంను సందర్శించిన మంత్రి సీతక్క, శిథిలావస్థలో ఉన్న గుడిసెలను పరిశీలించి పీవీటీజీలకు చెందిన 50 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.  

తిర్యాణి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

తిర్యాణి :   మండలంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధే విజయ్ రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిర్యాణి మండలంలో అనేక అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు  చేపట్టాలని కోరారు.