సిటీలో లైబ్రరీలు రాత్రి 7 వరకు పనిచేస్తయ్

సిటీలో లైబ్రరీలు రాత్రి 7 వరకు పనిచేస్తయ్
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మెహిదీపట్నం/సికింద్రాబాద్/పద్మారావునగర్,వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీలు ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసబ్​ట్యాంక్​లోని తన ఆఫీసులో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీల అభివృద్ధిపై రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్​తో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో చాలామంది స్టూడెంట్లు, నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. ఇందులో భాగంగా అన్ని లైబ్రరీల్లో న్యూస్ పేపర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్​ను అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 20 ప్రధాన లైబ్రరీల్లో స్టడీ మెటీరియల్ ఉందన్నారు.అవసరం మేరకు లైబ్రరీల వద్ద రూ. 5 భోజన కేంద్రాలైన అన్నపూర్ణ క్యాంటీన్​ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే 4 నెలల్లో లైబ్రరీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 82 లైబ్రరీలు ఉండగా, వాటిలో కొన్ని బిల్డింగ్​లకు సంబంధించి అభివృద్ధి, నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టామన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ సెక్రటరీ పద్మజ, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

28 మందికి దళిత బంధు
వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్​లో దళిత బంధు స్కీమ్ కింద 28 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ శర్మన్ వెహికల్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత బంధు కింద తీసుకున్న వెహికల్స్​ను లబ్ధిదారులు  ఇతరులకు అమ్మాలని చూస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పిల్లలను సర్కారు బడికి పంపించాలె
తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడికే పంపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. భోలక్​పూర్​లోని మేకలమండి ప్రభుత్వ స్కూల్​లో బుధవారం బడి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బడి బాటకు సంబంధించిన ఫ్లెక్సీ, పాంప్లెంట్లను రిలీజ్ చేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తూ.. స్టూడెంట్ల సంఖ్య పెంచేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ‘మన బడి– మన బస్తీ’ ప్రోగ్రామ్​లో భాగంగా సనత్​నగర్​లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్న మేకలమండి ప్రభుత్వ స్కూల్ టీచర్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మల్లికార్జున రెడ్డి, టీచర్లు  పాల్గొన్నారు.