
- గోదావరిలో 968 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తం: ఉత్తమ్
- కాళేశ్వరంతో లక్ష కోట్లు వృథా
- రూ.38 వేల కోట్లతోనే ప్రాణహిత–చేవెళ్ల పూర్తయ్యేది
- ఏపీ చేపడ్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని వెల్లడి
- రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి
గోదావరిఖని, వెలుగు: తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద కూడా బ్యారేజీ నిర్మించి తీరుతామని చెప్పారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలను సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్మూర్ వద్ద రూ.75 కోట్లతో నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఉత్తమ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంతర్గాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేసిందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే రూ.38 వేల కోట్లతోనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదని, గోదావరి పరీవాహక ప్రాంతంలో కరువు ఉండేది కాదని చెప్పారు. కాళేశ్వరం కట్టినప్పటికీ పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదన్నారు.
కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టి రిపోర్టు ఇచ్చిందని, దాన్ని కేబినెట్ ముందు పెడ్తామని తెలిపారు. ‘‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఫౌండేషన్ బలహీనంగా ఉంది. అక్కడ నీళ్లు నిల్వ చేస్తే 44 ఊళ్లు, భద్రాచలం టెంపుల్ కొట్టుకొని పోతాయని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్ట్ ఇచ్చింది. మూడు బ్యారేజీలను వాడుకోకుండానే పోయినేడాది రికార్డు స్థాయిలో 2.81 కోట్ల టన్నుల వడ్లు పండించినం” అని పేర్కొన్నారు.
తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ చూస్తున్నదని మండిపడ్డారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తెలిపారు. ‘‘ఏపీ పునర్విభజన చట్టం, తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ చూస్తున్నది. దీన్ని అన్ని వేదికల మీద వ్యతిరేకించాం. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నుంచి సెంట్రల్ వాటర్కమిషన్ వరకు ఫిర్యాదు చేసినం. ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు న్యాయపరంగానూ చర్యలు తీసుకుంటం” అని ఆయన చెప్పారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు..
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తున్నా మని ఉత్తమ్ తెలిపారు. కొత్తగా 8.60 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. రామగుండం ప్రాంతంలో 6,500 కొత్త కార్డులు ఇచ్చామని వెల్లడించారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చింది. ఆ బియ్యం పేదలు తినేవారు కాదు. ఆ బియ్యంలో 80 శాతం పక్కదారి పట్టేవి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా 3.17 కోట్ల మంది నిరుపేదలకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి సన్న బియ్యం ఇస్తున్నాం” అని పేర్కొన్నారు. సభలో ఉమ్మడి కరీంనగర్జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, విజయ రమణారావు, మేడిపల్లి సత్యం, ప్రభుత్వ సలహదారు హర్కర వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.