V6 News

IPL 2026: చెపాక్‎లో చెన్నై ఆల్ రౌండ్ షో.. 32 రన్స్ తేడాతో కేకేఆర్‎ను చిత్తు చేసిన గైక్వాడ్ సేన

IPL 2026: చెపాక్‎లో చెన్నై ఆల్ రౌండ్ షో.. 32 రన్స్ తేడాతో కేకేఆర్‎ను చిత్తు చేసిన గైక్వాడ్ సేన

చెన్నై: సొంతగడ్డ చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్‎తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి కోల్‎కతాను 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్‎లో సంజు (48), బ్రేవిస్ (41), ఆయుష్ మాత్రే (38) రాణించగా.. బౌలింగ్‎లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో కేకేఆర్‎ను దెబ్బకొట్టాడు. 

తద్వారా గైక్వాడ్ సేన ఈ సీజన్‎లో రెండో విజయాన్ని నమోదు చేయగా.. కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లో 192 పరుగులు చేసింది. చెన్నై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది.  

రాణించిన మాత్రే, సంజు, బ్రేవిస్:

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సరైన ఆరంభం దక్కలేదు. ఫామ్ లేమితో సతమతమవుతోన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచులో కూడా ఫ్లాఫ్ షో కొనసాగించాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అంకుల్ రాయ్ బౌలింగ్‎లో ఔట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన సంజు శాంసన్, ఆయూష్ మాత్రే ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. 

ముఖ్యంగా ఆయూష్ మాత్రే (17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో వైభవ్ ఆరోరా బౌలింగ్‎లో క్యాచ్ ఔటై పెవిలియన్ చేరాడు. ఢిల్లీపై సెంచరీతో చెలరేగి చెన్నైకు విజయాన్ని అందించిన సంజు శాంసన్ (48) హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. 

ఇక, సీజన్ తొలి నాలుగు మ్యాచులకు దూరమైన స్టార్ బ్యాటర్ బ్రేవీస్ ఫస్ట్ మ్యాచులోనే ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 41 రన్స్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ (23) ఫర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్, వైభవ్ ఆరోరా, అంకుల్ రాయ్ తలో వికెట్ తీశారు. 

బ్యాటింగ్‎లో కేకేఆర్ ప్లాఫ్ షో

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‎కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. తొలి ఓవర్లలోనే విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ (1)ను ఔట్ చేసి షాకిచ్చాడు అన్షుల్ కాంబోజ్. సునీల్ నరైన్ (24), రహానే (28), అంగ్క్రిష్ రఘువంశీ (27) కాసేపు పోరాడారు. 

కోట్లు కుమ్మరించి కొన్న కామెరూన్ గ్రీన్ డకౌట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. స్టార్ ఆల్ రౌండర్ రింకు సింగ్ (6) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. చివర్లో రోవ్మన్ పావెల్ (31), రమణ్‎దీప్ సింగ్ (35) పోరాడి పరుగుల అంతరాన్ని తగ్గించిన కేకేఆర్‎ను ఓటమి నుంచి గట్టేక్కించలేకపోయారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశాడు.హోస్సేన్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.