స్పిన్‌‌‌‌ టెస్ట్‌‌ కు టీమిండియా రెడీ ఆగస్టు 7 నుంచి లంక  ఎలెవెన్‌‌తో వామప్‌‌ మ్యాచ్‌‌.. గిల్‌‌కు గాయం!

స్పిన్‌‌‌‌ టెస్ట్‌‌ కు టీమిండియా రెడీ  ఆగస్టు 7 నుంచి లంక  ఎలెవెన్‌‌తో వామప్‌‌ మ్యాచ్‌‌.. గిల్‌‌కు గాయం!

కొలంబో: శ్రీలంక గడ్డపై రెండు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ల సవాల్‌‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి లంక ఎలెవన్‌‌తో మూడు రోజుల వామప్‌‌ మ్యాచ్‌‌ జరగనుంది. ఇందులో ప్రధానంగా లంక స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా గిల్‌‌సేన బరిలోకి దిగుతున్నది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌‌,  సౌతాఫ్రికాలతో జరిగిన సిరీస్‌‌ల్లో నాణ్యమైన స్పిన్‌‌ బౌలింగ్‌‌ను ఆడటంలో టీమిండియా ఘోరంగా తడబడింది. లంక పిచ్‌‌లపై కూడా అదే సవాలు ఎదురుకానుండటంతో తొలి టెస్ట్‌‌ నాటికి స్పిన్‌‌ బలహీనతలను అధిగమించాలని టీమిండియా భావిస్తోంది. ఈ నెల 15 నుంచి గాలెలో తొలి టెస్ట్‌‌ జరగనుండటంతో ఈ వామప్‌‌ మ్యాచ్‌‌ అత్యంత కీలకం కానుంది. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌, యశస్వి జైస్వాల్‌‌ వంటి ప్రధాన బ్యాటర్లు కొలంబోకు బయలుదేరే ముందు తమ సొంత ప్రాంతాల్లో స్పిన్‌‌ బౌలింగ్‌‌ను ఎదుర్కోవడానికి వ్యక్తిగతంగా కొన్ని ప్రయోగాలు చేశారు. అయితే లంక పిచ్‌‌పై నేరుగా ఆడిన అనుభవం మాత్రం లేకపోవడం మైనస్‌‌గా కనిపిస్తోంది. 

దశాబ్దం తర్వాత..

2017లో టీమిండియా చివరిసారి లంకతో టెస్ట్ సిరీస్‌‌ ఆడింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్‌‌లో బరిలోకి దిగుతోంది. అప్పటి జట్టుతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న టీమ్‌‌లో చాలామంది కొత్త వాళ్లు ఉన్నారు. లంక గడ్డపై రెడ్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌ ఆడటం వాళ్లకే ఇదే మొదటిసారి. కాబట్టి వాళ్లంతా గాడిలో పడటానికి ఈ మ్యాచ్‌‌ కీలకం కానుంది. వాతావరణ పరిస్థితులు, పిచ్‌‌పై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుత జట్టులో రాహుల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌, రవీంద్ర జడేజా మాత్రమే లంకలో టెస్ట్‌‌ మ్యాచ్‌‌లు ఆడారు. కాబట్టి వీళ్ల అనుభవం జట్టుకు ఎంతో అవసరం.

సిరాజ్‌‌ నాయకత్వంలో.. 

గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో, పేసర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియా బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. అతనికి ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ మరియు సారాన్ష్ జైన్ మద్దతుగా నిలవనున్నారు. సిరాజ్ మరియు కుల్దీప్ మినహా మిగిలిన బౌలర్లకు అంతగా అనుభవం లేనప్పటికీ, శ్రీలంక పిచ్‌‌పై బౌలింగ్ చేయడానికి వాళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెలలో గాలెలో శ్రీలంక–ఎతో జరిగిన సిరీస్‌‌లో ఇండియా–ఎ తరఫున బ్రార్‌‌, జైన్ అద్భుతంగా రాణించారు. ఇప్పుడు మరోసారి అలాంటి పెర్ఫామెన్స్‌‌ చూపెట్టడానికి వాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయాన్ని హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ కూడా అంగీకరించాడు. ‘మన ముందు ఏముందో మనకు తెలుసు. మనం ఎక్కువ రన్స్‌‌ చేయగలం. పరిమితులను అధిగమించగలం. అన్ని విధాలుగా రాణించగలం. 15వ తేదీ ఉదయం మనం మొదట బ్యాటింగ్‌‌ చేసినా బౌలింగ్‌‌ చేసినా ఎదురయ్యే ప్రతి సవాలుకు మేం రెడీగా ఉంటాం. ఇప్పట్నించే అన్ని విభాగాలను పటిష్టం చేసుకుంటున్నాం’ అని గౌతీ పేర్కొన్నాడు. మరోవైపు వామప్‌‌ మ్యాచ్‌‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శుక్రవారం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే చాన్స్‌‌ ఉందని అంచనా వేస్తున్నారు. 

గిల్‌‌ ఆడతాడా?

గురువారం జరిగిన నెట్‌‌ ప్రాక్టీస్‌‌లో కెప్టెన్‌‌ గిల్‌‌ చేతి వేలికి గాయమైనట్లు సమాచారం. ఫాస్ట్‌‌ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్‌‌ కుడి చేతి బొటన వేలికి బంతి బలంగా తాకిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో టీమ్‌‌ డాక్టర్‌‌ వచ్చి గిల్‌‌ గాయాన్ని పరిశీలించి ట్రీట్‌‌మెంట్‌‌ ఇచ్చాడు. దాంతో కొద్దిసేపు రెస్ట్‌‌ తీసుకున్న గిల్‌‌.. తర్వాత బ్యాటింగ్‌‌ సెషన్‌‌ను కొనసాగించాడు. ఆ తర్వాత కేఎల్‌‌ రాహుల్‌‌, యశస్వి జైస్వాల్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ వరుసగా తమ బ్యాటింగ్‌‌కు పదును పెట్టుకున్నారు. సిరాజ్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ బౌలింగ్‌‌ను సరి చూసుకున్నారు.