V6 News

మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే సొంత నియోజకవర్గాలు కోల్పోయే నేతలు వీళ్లే..!

మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే సొంత నియోజకవర్గాలు కోల్పోయే నేతలు వీళ్లే..!

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అడుగులేస్తున్న తరుణంలో ఒక ఆసక్తికర విశ్లేషణ వెలుగులోకి వచ్చింది. మహిళల రిజర్వేషన్ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయడానికి, లోక్​సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కి పెంచే బిల్లును  ఆమోదించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ  కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్న పలువురు ప్రముఖ ఎంపీల సిట్టింగ్ సీట్లకు ఎసరు వచ్చినట్టే కనిపిస్తోంది.

మహిళా ఓటర్ల శాతాన్ని ప్రాతిపదికగా చేసుకుని 33 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తే.. రాజ్ నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, నితిన్ గడ్కరీ.. ఇలా పలువురు ఎంపీలు సిట్టింగ్ స్థానాలను కోల్పోయి ఎన్నికల్లో పోటీకి మరో లోక్ సభ స్థానం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. తెలంగాణలో బండి సంజయ్కి కూడా స్థాన చలనం తప్పేలా లేదు. 2024 కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల డేటాను ఒక్కసారి పరిశీలిస్తే.. రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానమైన రాయ్ బరేలీలో.. 47.7 శాతం మంది ఓటర్లు మహిళలే కావడం గమనార్హం. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే.. ఈ స్థానం మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

ఇక.. లక్నో లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీటు కూడా మహిళలకు కేటాయించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. లక్నో పార్లమెంట్ స్థానంలో 47.11 శాతం ఓటర్లు మహిళలే. ఇక.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నియోజకవర్గంలో అయితే ఏకంగా.. 49.9 శాతం మంది మహిళా ఓటర్లే కావడం విశేషం. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే కచ్చితంగా మహిళలకు కేటాయించే స్థానాల్లో నాగ్పూర్ ముందు వరుసలో ఉంటుంది.

తెలంగాణ, ఏపీల్లో కూడా కొందరు సిట్టింగ్ ఎంపీలు మరో స్థానం నుంచి పోటీ చేయకతప్పేలా లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్ సభ స్థానాల్లో కూడా మహిళా ఓటర్లదే హవా. కేంద్రం 33 శాతం మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తే బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మరో లోక్ సభ స్థానం వెతుక్కోక తప్పదు.