- కేంద్ర సర్కార్ దేశంలో ఓట్లు, సీట్ల చోరీలకు పాల్పడుతుంది
- క్యాతనపల్లి, బెల్లంపల్లిలో సర్‌పై అవగాహన సదస్సులు
- ఎమ్మెల్యే వినోద్, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేశ్‌షెట్కార్ హాజరు
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పేరిట అక్రమ పద్ధతుల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి ఓటు హక్కును కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, బెల్లంపల్లిలో జరిగిన సర్ సదస్సులో మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు.
సర్ తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ను ఓడించాలనే కేంద్ర ప్రభుత్వం 2002 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తోందని విమర్శించారు. సర్ పేరుతో బిహార్‌లో 60 లక్షలు, బెంగాల్‌లో 90 లక్షల ఓట్లు తీసేశారని, దీని వల్లే పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారన్నారు. దేశంలో ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గళం విప్పారని గుర్తుచేశారు.
మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించి బీజేపీ సీట్ల చోరీకి పాల్పడిందని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థలా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని మండిపడ్డారు. సర్ వల్ల అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, బీఎల్‌ఏలకు మంత్రి సూచించారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి బీఎల్‌ఏలు ఓటర్ల ఇంటికి వెళ్లి పరిశీలించాలని, జాబితాలోని తప్పులను జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘానికి సమర్పించాలని సూచించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని, హైదరాబాద్ చుట్టూ 20 వేల ఎకరాల భూములను దండుకున్నారని మంత్రి వివేక్ ఆరోపించారు. ఇసుక దందా, భూ మాఫియా ద్వారా దండుకున్న రూ.వందల కోట్లను ఎన్నికల్లో ఖర్చు చేశారన్నారు. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులు, భారీ భవనాలు కట్టి కమీషన్ల రూపంలో కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.
10 వేల ఇండ్లు ఇచ్చాం..
తోగుట, వెలుగు: ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తున్నదని మంత్రి వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి మెదక్ జిల్లాలో దాదాపు 10 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. అందులో 80 శాతం గ్రౌండింగ్ కాగా, 5 వేలు ఇండ్లు శ్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. గురువారం సాయంత్రం అక్బర్ పేట -భూంపల్లి మండల కేంద్రంలో లో దుబ్బాక నియోజకవర్గంలోనీ దుబ్బాక, మీరుదొడ్డి, రాయపోల్, తోగుట, దౌల్తబాద్, అక్బర్ పేట భూంపల్లి మండలాలకు 594 లబ్ధిదారులకు రూ.5.94 కోట్ల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఇందులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.హైమావతి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశంలో సిట్టింగ్ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ‘సర్’ముసుగులో ఓటర్లను తొలగిస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో సిట్టింగ్ సీట్లలోని లక్షల ఓట్లను బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై తొలగించిందని ఆరోపించారు. ఓటు, సీటు చోరీలతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని ఆయన విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటోందని ఆరోపించారు.
నీట్ పేపర్ లీక్‌ను బీజేపీ మంత్రులే చేశారని ఆరోపించారు. దేశంలోని జరుగుతున్న స్కామ్‌ల్లో బీజేపీ మంత్రులు పేర్లు బయటపడుతున్నాయని తెలిపారు. సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, పీసీసీ బాధ్యులు హఫీజ్, రాజేశ్, క్యాతనపల్లి, బెల్లంపల్లి టౌన్ప్రెసిడెంట్లుఒడ్నాల శ్రీనివాస్, బండి ప్రభాకర్ పాల్గొన్నారు.
