హైదరాబాద్ మల్లేపల్లిలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. సెంటర్‌లో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణా విధానాన్ని గమనించిన మంత్రి... అక్కడి వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతకు కేవలం ఒక్క నైపుణ్యం మాత్రమే సరిపోదని... మల్టీ స్కిల్స్ ఉంటేనే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో సాఫ్ట్‌వేర్ రంగంలో లే-ఆఫ్స్ నడుస్తున్న వేళ... ఇలాంటి ఏటీసీ సెంటర్లు విద్యార్థులకు ఒక వరంలా మారి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని కొనియాడారు.
ప్రస్తుతం ఈ మల్లేపల్లి ఏటీసీ సెంటర్‌లో 200 మంది విద్యార్థులు సరికొత్త కోర్సుల్లో అత్యాధునిక శిక్షణ పొందుతున్నారని తెలిపారు వివేక్. వీరికి నైపుణ్యంతో పాటు అదనంగా నెలకు 2 వేల రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తున్నామన్నారు. అందుకే ఇక్కడి కోచింగ్ పట్ల విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారని చెప్పారు.
తాను ఏ పారిశ్రామికవేత్తల సమావేశానికి వెళ్లినా... పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్ ఉన్న యువత కొరత గురించే మాట్లాడుతున్నారని మంత్రి గుర్తుచేశారు. అందుకే ఇండస్ట్రీల అవసరాలకు తగ్గట్టుగానే విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భవిష్యత్ పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడంలో ఈ ఏటీసీలు, ఐటీఐలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేశారు.
