- ప్రాజెక్టుకు -భూములిచ్చిన రైతులను బీఆర్‌ఎస్ పట్టించుకోలే
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా హామీలు అమలు చేస్తున్నం
- -మున్సిపాలిటీల్లో 90 శాతం కాంగ్రెస్ అభ్యర్థులదే విజయం
- చెన్నూరు మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఇంటింటి ప్రచారం
కోల్‌బెల్ట్/చెన్నూరు/మంథని, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఈ నెల 9వ తేదీన పరిహారం అందజేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. కాళేశ్వరంతో చుక్కనీరు రాకపోయినా రైతులకు మాత్రం నష్టం జరిగిందన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని కాంగ్రెస్ అభ్యర్థులు తరఫున ఆయన ప్రచారం చేశారు. పలు వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులకు కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం గౌడ సంఘం సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ప్రాణిహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు కృషి చేశారని, దాన్ని కమీషన్ల కోసం బీఆర్ఎస్ మార్చేసిందని ఆరోపించారు. మిషన్ భగీరథలో రూ.60 వేల కోట్లు, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు మింగారని ఆరోపించారు. కాళేశ్వరం కోసం కోటపల్లి మండలంలోని బబ్బెరచెలక, దేవులవాడ, వెల్మపల్లి గ్రామాల రైతుల నుంచి 250 ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.28 వేల కోట్ల పరిహారం మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుతో కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడరన్నారు. కేసీఆర్ తన పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని చెప్పారు.
చెన్నూరులో రూ.500 కోట్లతో అభివృద్ది పనులు..
చెన్నూరులో రూ.500 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులను చేపట్టామని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి బాల్క సుమన్ చేసింది శూన్యమన్నారు. ముదిరాజ్, మున్నూరుకాపు, పద్మశాలి, గౌడ, విశ్వబ్రహ్మాణ, మేరు కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి రూ.1.55 కోట్లు సాంక్షన్ చేసినట్లు తెలిపారు. గౌడ కులస్తుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. చెన్నూరు గోదావరి ఒడ్డున శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరు చేశానని, ఇందుకు ఎకరం భూమి ఇచ్చిన మల్లేశ్ గౌడ్‌ను మంత్రి అభినందించారు. అమృత్ స్కీం ద్వారా రూ.30 కోట్లతో ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మరో ఆరు నెలల్లో నల్లాల ద్వారా ఇంటింటికి వాటర్ సప్లై చేస్తామన్నారు. వచ్చే 5 ఏండ్ల వరకు చెన్నూరుకు నీటిఎద్దడి రాకుండా రూ.45 కోట్లతో గోదావరి శాశ్వత నీటి పథకాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు.
ఏటీసీ సెంటర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్..
యువతకు కొత్త కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.50 కోట్లతో ఏటీసీ సెంటర్ నిర్మిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అలాగే, రూ.250 కోట్లతో సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు చెప్పారు. మేలో ఆస్పత్రిని ప్రారంభిస్తామని, ఇక్కడ తగినంత స్టాఫ్ ఇవ్వాలని మంత్రి దామెదర రాజనర్సింహను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుందని, సింగరేణి వేలంలో పాల్గొని కొత్త గనుల పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎన్నికల్లో 90 శాతం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వేల్లో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. కాగా, మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి భౌతికకాయానికి మంత్రి వివేక్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రాంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దపల్లి ఎంపీగా కాకా వెంకటస్వామి కొనసాగారని, వారిద్దరు అన్నదమ్ముల్లా కలసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. రాంరెడ్డితో తమ కుటుంబానికి మంచి సంబంధాలున్నామని గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి మృతి మంథని ప్రజలకు తీరని లోటు అన్నారు.
