ఆటో కార్మిక సంఘాలతో మంత్రుల కీలక సమావేశం.. సంక్షేమ బోర్డుపై ప్రధాన చర్చ

ఆటో కార్మిక సంఘాలతో మంత్రుల కీలక సమావేశం.. సంక్షేమ బోర్డుపై ప్రధాన చర్చ

హైదరాబాద్: సచివాలయంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి కీలక సమావేశం నిర్వహించారు. పలు  శాఖల ఉన్నతాధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఆటో కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు

సమావేశంలో ప్రధానంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశంపై చర్చిస్తున్నారు. ఆటో కార్మిక సంఘాల యూనియన్లు సమర్పించిన పలు  ప్రతిపాదనలను మంత్రులు, అధికారులు పరిశీలించారు. కార్మికులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరేలా సంక్షేమ బోర్డు ఏర్పాటుపై చర్యలు తీసుకునే అంశాన్ని చర్చించనున్నారు

ఆటో కార్మికులు చాలాకాలంగా కోరుతున్న మీటర్ ఛార్జీల పెంపు అంశం కూడా సమావేశంలో ప్రస్తావించనున్నారు. ప్రస్తుత పరిస్థితులు, ఆటో డ్రైవర్ల ఆదాయం, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకునే అంశంపై చర్చలు జరగనున్నాయి. 

డీజిల్, పెట్రోల్ ఆటోలను రీట్రోఫిట్మెంట్ చేసుకునే వారికి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపైనా సమావేశంలో చర్చ జరుగుతోంది. రీట్రోఫిట్మెంట్ కోసం రూ.1.50 లక్షల సహాయానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. ఈ పథకం అమలు, ఆటో కార్మికులకు కలిగే ప్రయోజనాలపై అధికారులు వివరించనున్నారు. ఆటో డ్రైవర్లకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకునే దిశగా సమావేశంలో చర్చలు కొనసాగుతున్నాయి.