- ఆ పథకం పేరిట బీఆర్ఎస్ లీడర్లు దందా చేసిన్రు
- బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణిలో అవకతవకలు
- ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని వెల్లడి
కోల్‌బెల్ట్/కోటపల్లి, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ ఒక ఫెయిల్డ్ప్రాజెక్ట్ అని.. రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఇంటికీ తాగునీరు ఇవ్వలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మిషన్ భగీరథ పేరిట బీఆర్ఎస్ లీడర్లు దందా చేశారని.. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని చేశారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో మంగళవారం మంత్రి పర్యటించారు. రూ.60 లక్షలతో లింగన్నపేట, ఎదులబంధం, సిర్స, రొయ్యలపల్లి, అలుగామ, వెంచపల్లి, జనగామ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎస్డీఎఫ్, డీఎంఎఫ్ టీ నిధులతో బోర్వెల్స్వేయించానని, మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో రూ.100 కోట్లతో అమృత్స్కీం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.46 కోట్లతో చెన్నూరు మున్సిపాలిటీలో మరో తాగునీటి స్కీమ్ చేపడుతున్నట్టు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించినట్టు తెలిపారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు..
పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో ఒక్క డబుల్బెడ్రూంఇల్లు కూడా కేటాయించలేదని, పేదలకు రేషన్‌కార్డులు ఇవ్వకుండా మోసం చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా ఉండకూడదన్న సంకల్పంతో కాంగ్రెస్ సర్కార్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందన్నారు. ఈ ఏడాది చెన్నూరు నియోజకవర్గానికి మరో 2 వేల ఇండ్లు మంజూరవుతాయని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గానికి రెండు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరయ్యాయని.. వాటిని మందమర్రి, చెన్నూరులో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందన్నారు. అన్ని విద్యా సంస్థల్లో వసతులు కల్పించామని, రూ.46 కోట్లతో చెన్నూరులో ఏటీసీ ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యువతకు స్కిల్స్ శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. వచ్చే నెలాఖరుకు చెన్నూరులో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తామని, మందమర్రిలో 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. ఈ యేడాది 25శాతం ఎక్కువ కొనుగోళ్లు ధాన్యం జరిగాయన్నారు. ఈ కొనుగోళ్లపై బీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. యాప్ ద్వారా రైతులకు పూర్తి స్థాయి యూరియాను సప్లై చేస్తామని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ఎదులబంధంలో ప్రభుత్వ స్కూలును సందర్శించి మూత్రశాలలు, విద్యుత్, ఇతర మరమ్మతులపై అధికారులకు మంత్రి వివేక్ ఆదేశాలిచ్చారు. జనగామలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి విక్రయాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. జనగామలో తాటి లక్ష్మి, -శ్రీనివాస్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని మంత్రి
ప్రారంభించారు. వెంచెపల్లిలో ఇటీవల ప్రాణహిత నదిలో పడి చనిపోయిన పబ్బా అజయ్‌గౌడ్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఎదులబంధం, రొయ్యలపల్లి, జనగామల్లో లక్ష్మిదేవర, హనుమాన్, మధునపోచమ్మ దేవాలయాల్లో మంత్రి పూజలు చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్ తివారీ, కోటపల్లి మండల కాంగ్రెస్
ప్రెసిడెంట్ కట్రాల మల్లయ్య, సర్పంచులు,
ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయంలోనే సింగరేణిలో అవకతవకలు
బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణిలో అవకతవకలు జరిగాయని, వాటిపై ఎంక్వైరీ జరుగుతుందని మంత్రి వివేక్ ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి రూ.7వేల కోట్ల లాభాలు రాగా.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రూ.11 వేల కోట్ల లాభాలు వచ్చాయన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని.. బొగ్గు మాయమైతే రూ.11వేల కోట్లు లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మాఫియాకు అడ్డుకట్టవేశామని, వేబ్రిడ్జిలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై నమ్మకంతో గనుల శాఖ బాధ్యతలు అప్పగించారని.. ఇసుక రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి గతంలో రూ.700 కోట్ల ఆదాయం రాగా.. గతేడాది ఆదాయాన్ని వెయ్యి కోట్లకు తీసుకువచ్చానని అన్నారు. వచ్చే ఏడాది రూ.1,400 కోట్ల ఆదాయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు.
