మియాపూర్, వెలుగు: హైదరాబాద్ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిపై సీఎం రేవంత్రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆరోపించారు. మెట్రో రైలు ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణం జరుగుతోందన్నారు. అందుకే హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో రేవంత్ రెడ్డి, - కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. మియాపూర్ లో మంగళవారం శేరిలింగపల్లి నియోజవకర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్త్రత స్థాయి సమావేశం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్చీఫ్గెస్ట్గా హాజరై మాట్లాడారు.
హైదరాబాద్ మెట్రో రైల్కు చెందిన ఆస్తుల కోసం మెట్రో రైల్, ఎల్ అండ్ టీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తరిమేశారన్నారు. ప్రస్తుతం ఎల్ ఆండ్ టీ అప్పు రూ.14 వేల కోట్లను రాష్ట్ర ప్రజలపై సీఎం రుద్దుతున్నారని ఆరోపించారు. మెట్రో రైలుపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజల దృష్టి ఆకర్షించే విఫల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లలో ఇటుక పేర్చింది లేదు కానీ.. కూల్చిందే ఎక్కువ అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తుగ్లక్ ఆదర్శం కాబట్టే, హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా లక్షల మంది ఇండ్లను కూలగొట్టి, మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు తెరలేపాడని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో ఎన్నికల్లో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన అవినీతి, అక్రమాలను కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లోకి మారారన్నారు. మళ్లీ శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలంటే కార్యకర్తలంతా కలిసికట్టుగా కదం తొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పైన కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలోనే సభ్యత్వ నమోదు యాప్ విడుదల చేస్తామన్నారు.
