సర్‌‌‌‌ను పకడ్బందీగా చేయాలి..15 అంశాలతో సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్ వినతి పత్రం

సర్‌‌‌‌ను పకడ్బందీగా చేయాలి..15 అంశాలతో సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్ వినతి పత్రం

హైదరాబాద్, వెలుగు: స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్ (ఎస్‌‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్​ రెడ్డిని బీఆర్‌‌‌‌ఎస్ నేతలు కోరారు. ప్రతిదశనూ నిశితంగా పర్యవేక్షించాలని, ఎక్కడాలోపాలు లేకుండా చూడాలని కోరారు. మంగళవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ నేతృత్వంలోని బీఆర్‌‌‌‌ఎస్​నేతలు సుదర్శన్​రెడ్డిని కలిసి15 అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించారు. ఒకే నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించాలని కోరారు.

ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల ఎలక్టోరల్​ లిస్టును పరిశీలించాలని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయినవాళ్లు, ప్రాంతం మారిన వారి పేర్లను అన్ని పరిశీలించాకే తొలగించాలన్నారు. ‘సర్’​ ప్రక్రియలో ఏవైనా లోపాలుంటే ఫిర్యాదు చేసేందుకు గ్రీవెన్స్​సెల్‌‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎలక్షన్​కమిషన్​ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఒకరికి అనేక ఓట్లా: దాసోజు శ్రవణ్

సీఈవో  సుదర్శన్​రెడ్డిని కలిసిన అనంతరం బయట మీడియాతో దాసోజు శ్రవణ్​మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు సుదర్శన్ రెడ్డిని కలిశామని పేర్కొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారని వెల్లడించారు. ఒక్కొక్కరికి నాలుగు, అయిదు చోట్ల ఓట్లు ఉన్నాయని, అది చట్ట వ్యతిరేకమని వివరించారు. ఇప్పుడున్న తరుణంలో ఇబ్బందులు ఉంటే కచ్చితంగా సవరించాలని చెప్పామన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల వివరాలు తెలిస్తే ఆయా రాష్ట్రాల సీఈవోలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.