మంత్రి కొప్పుల ఇలాకాలో ప్రజలు నీటి కోసం గోస పడుతున్నారు. తలాపునే గోదావరి ఉన్న పట్టణ కేంద్రంలో నీటి కటకట తప్పట్లేదు. మిషన్ భగీరథ నీరే..ధర్మపురి పట్టణ ప్రజలకు ఆధారం.. కానీ ఎప్పుడూ రిపేర్ల పేరుతో నీరు అందక జనం అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం డబ్బా గ్రామం నుంచి సుమారు 80 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ధర్మపురికి మిషన్ భగీరథ నీరు చేరుతుంది. అయితే పైప్ లైన్ మార్గం మధ్యలో నిత్యం ఏదో ఒక చోట లీకేజీలు, మోటార్ రిపేర్లు కావడంతో ధర్మపురిలో నీటి కష్టాలు ఏర్పడుతున్నాయి.
గత రెండు రోజుల క్రితం.. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు నిలిచి పోవడంతో పట్టణ జనాలు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. దీంతో మోటార్ రిపేర్ త్వరితగతిన పూర్తి చేశారు అధికారులు. రెండు రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీరు వదులుతున్నారు. ఈ క్రమంలో నక్కలపేట్, కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ,8వ వార్డు, బ్రాహ్మణవాడ, తెనుగువాడ కాలనీలకు అందకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 400 ఇండ్లకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టణ వాసులు.
మంత్రి కొప్పుల, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య నీళ్ల పంచాయతీ నడుస్తున్నట్లుగా సమాచారం. మెట్పల్లి డబ్బా గ్రామం నుంచి వచ్చిన మిషన్ భగీరథ నీరు జగిత్యాల జిల్లా కేంద్రంలో వాటర్ టాంక్ లు నింపినా తరవాతే ధర్మపురికి పంపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అభివృద్ధి పనుల పేరుతో మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడికక్కడ డ్యామేజ్ చేస్తున్నారు. ఇదే అదునుగా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పట్టణ ప్రజలను దోచుకుంటున్నారు. ఒక్కో వాటర్ డబ్బాకు 20 నుంచి 25 రూపాయల వసూళ్లు చేస్తున్నారు. తము నీరు లేక కష్టాలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టనట్టు ఉంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
