ఇండియాలో పొరపాటున కూడా ఒక పాలకుడు నేను హిట్లర్ అభిమానిని అంటే అతడు లేదా ఆమె జీవితం రాజకీయ గందరగోళంలోకి నెట్టబడుతుంది. హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధాన్ని సృష్టించినప్పుడు, చుట్టుపక్కల దేశాల మీద దాడులు చేస్తున్నప్పుడు అతడిని ప్రపంచమంతా ద్వేషించుకున్నది. అతను జ్యూస్‌ని ఊచకోత కోస్తున్నప్పుడు అతడిని ప్రపంచంలో చిన్న పిల్లలు సైతం చీదరించుకున్నారు.
భారతదేశంలో హిట్లర్ సమకాలీనులుగా మహాత్మా గాంధీ, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. అంబేద్కర్ సుదీర్ఘమైన తన చదువును అమెరికాలో, ఇంగ్లాండ్‌లో ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చి తీవ్రమైన కుల వ్యతిరేక పోరాటంలో ఉన్నాడు. మహాత్మా గాంధీ హిట్లర్‌ను మానవ మానిస్టర్‌గా, హింసకు ప్రతిరూపంగా అభివర్ణించాడు.
హిట్లర్ యుద్ధహింసను, యూదుల అమానుష హత్యాకాండను ఆపాలని ఆయనకు రెండు ఉత్తరాలు రాశాడు. హిట్లర్తనను కలవడానికి జర్మనీకి రావాలని, గాంధీ యూరప్‌లో పర్యటిస్తున్నప్పుడు కోరితే గాంధీ ఆయనను కలవడానికి నిరాకరించాడు.
అంబేద్కర్ తన కుల నిర్మూలన గ్రంథంలో మనుస్మృతి వంటి హిందూ గ్రంథాలను హిట్లర్ నాజీ ఫిలాసఫీ ప్రాచీన ప్రతిరూపాలని, హిట్లర్ నాజీజం మానవాళి మధ్య విధ్వంసాన్ని సృష్టించడానికి ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు. అంతేకాక భారతదేశంలోని కుల వ్యవస్థకు ప్రాచీన కాల వ్యవస్థ, హిట్లర్‌లాంటి మానవ అసమానత ప్రేమికుల వల్ల పుట్టి పెరిగిందని చెప్పాడు.
పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ తను రాసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తకంలో హిట్లర్ ఫాసిస్టు సిద్ధాంతాన్ని చాలా తీవ్రంగా తూర్పారపట్టాడు. ఆయన ప్రపంచాన్ని సర్వనాశనాన్ని చేయడానికే నాజీ నిర్మాణం చేశాడని, హిట్లర్ వ్యతిరేక యుద్ధశక్తులకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తుందని చెప్పాడు. హిట్లర్ఆత్మహత్య చేసుకుని చనిపోయి, దాదాపు యుద్ధం ఆగిపోయే స్థితి ఏర్పడ్డ ఏప్రిల్ 30, 1945 ఒక పండుగ దినంగా భారతదేశం భావించింది. కాంగ్రెస్ నాయకులంతా క్విట్ ఇండియా ఉద్యమం వల్ల జైల్లో ఉన్నా హిట్లర్ అంతం ప్రపంచశాంతికి మార్గమవుతుందని ఫీల్ అయ్యారు.
కాంగ్రెస్ సీఎం హిట్లర్ ఇన్‌స్పిరేషన్ సమస్య
జాతీయ ఆంగ్ల పత్రిక మాజీ ఎడిటర్ ఎన్. రామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ప్రభుత్వ వింగ్‌ను నేను హిట్లర్ ఇన్‌స్పిరేషన్‌తో పెట్టానని చెప్పడం ఆ ఇంటర్వ్యూను చూసిన వారినందరిని షాక్‌కు గురిచేసింది. హైడ్రా ఫుల్‌ఫామ్..‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. అస్సలు ‘హెచ్‌వైడీఆర్‌ఏఏ’ (హైడ్రా) అనే షార్ట్‌ఫామ్ తప్పు.
అందులో మానిటరింగ్ అనే కీలకమైన పదానికి చోటేలేదు. ఇది ఒక ఐపీఎస్ అధికారి నాయకత్వంలో నడిచే అతి చిన్న సంస్థ. ఇది చేపడుతున్న కూలగొట్టడాలపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి హిట్లర్‌కి ఏం సంబంధం? నాజీజం చరిత్రలో కూడా హైడ్రా అనే వింగ్‌ను హిట్లర్ ఉపయోగించినట్టు ఎక్కడా లేదు. అయినా రేవంత్ రెడ్డి తను ప్రారంభించిన హైడ్రా హిట్లర్ ఇన్‌స్పిరేషన్‌తో పెట్టానని ఎందుకు అన్నట్టు?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చాక.. జాతీయస్థాయి గుర్తింపు
కాంగ్రెస్‌లో చేరాక రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడయ్యాడు, అతికొద్ది రోజుల్లోనే తెలంగాణ సీఎం అయ్యాడు. గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్లాట్‌ఫామ్ నుంచి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాహుల్‌గాంధీ ఆయనకు చాలా జాతీయస్థాయిలో గుర్తింపువచ్చే నాయకునిగా అవకాశమిచ్చాడు. ఆయన టీడీపీలోనే ఉన్నా, లేదా బీజేపీలాంటి జాతీయ పార్టీలో చేరినా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేదికాదు.
జాతీయస్థాయిలో ఇప్పుడున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉండేదికాదు. బీజేపీలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వారికెవరికీ బయటి రాష్ట్రాల్లో ఒక జాతీయస్థాయి గుర్తింపుగల నాయకుడిగా ఎదిగే అవకాశం దొరకలేదు. అటువంటి దశలో తెలంగాణలో పార్టీకీ, తనకు నష్టం తెచ్చే ఎన్టీఆర్ విగ్రహం ఇనాగరేషన్ ఎందుకు చేశాడు? సిద్ధాంతపరంగా ఇవాళ బీజేపీ నాయకులు కూడా మాట్లాడలేని హిట్లర్‌తో ఇన్‌స్పైర్ అయ్యాననే సిద్దాంతపర నష్టదాయకమైన స్టేట్‌మెంట్ ఎందుకు చేశాడు?
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావల్సిన దశ ఇది!
బీజేపీ, ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్‌లాగ హిట్లర్‌ను పొగిడితే అంతగా గుర్తింపు దొరికే పరిస్థితి లేదు. అక్కడ గుర్తింపు దొరకాలంటే ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేక ప్రచారం పనికొస్తుంది. అది మోదీకి, అమిత్ షాకి పనికొచ్చింది. హిమంత బిశ్వ శర్మకు, సువేందు అధికారికి పనికొస్తూనే ఉంది. ఇక్కడ బండి సంజయ్ వంటి నేత ప్రచారంలో ఉన్నాడు. ఒకవైపు బీజేపీ అన్ని ప్రాంతీయ పార్టీలకు బ్రేక్‌చేస్తోంది. తృణమూల్, శివసేన ఎంపీలను ఇప్పటికే లాక్కుంది. ప్రాంతీయ పార్టీలు రాజ్యాంగాన్ని రక్షించే పోరాటంలో నిలవాలంటే అవి కాంగ్రెస్‌లో విలీనమవ్వడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్న దశ.
ఈ స్థితిలోనే రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ మీటింగ్‌లో 1927 నుంచి స్వాతంత్ర్యం కోసం గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌ల నాయకత్వంలో రెజిస్టెన్స్ ఉద్యమం నడిపినట్టు దేశంలో మరో రెజిస్టెన్స్ ఉద్యమం నడపాల్సిన దశ వేగంగా ముందుకొస్తున్నట్టు కనిపిస్తోంది అని చెప్పాడు. కర్నాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్ఎస్‌కు దాని లీగల్ స్టేటస్, దాని ఆర్థిక వనరుల గురించి ఉత్తరం రాసి దేశంలో ఒక పెద్ద చర్చకు తెరలేపాడు. ఈ చర్చ కాంగ్రెస్ ఎన్నడో చేయాల్సి ఉంది. 60 ఏండ్లకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ లేకుండా, ఇన్‌కమ్ ట్యాక్స్
నెట్‌వర్క్‌లోకి రాకుండా ఎలా నడవనిచ్చింది? అనే ప్రశ్న పెద్ద ఎత్తున ముందుకొస్తుంది.
రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానంపై సిద్ధాంత అపనమ్మకం ఏర్పడదా?
ఈ స్థితిలో తెలంగాణ సీఎం, రాష్ట్ర హోం మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ...హిట్లర్ నాకు ఆదర్శమంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానంపై సిద్ధాంత అపనమ్మకం ఏర్పడదా? నిన్న మొన్నటివరకు ఆర్ఎస్ఎస్, బీజేపీల మీద తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పడు హిట్లర్ అభిమాని అవుడేంది అని ప్రజానీకానికి అనుమానం రాదా? హిట్లర్ చంద్రశేఖర్‌రావో, కేటీ రామారావో కాదు కదా!
హిట్లర్ ప్రపంచానికి ప్రమాదకారి. రాహుల్ గాంధీకి దేశస్థాయిలో కుడిభుజంగా ఉంటాడనుకున్న రేవంత్‌రెడ్డి అకస్మాత్తుగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడని దేశ ప్రజలకు, ఎన్టీఆర్‌కు తిరిగి తెలంగాణలో విగ్రహాలు పెట్టుకుంటూపోతే, తెలంగాణ ప్రజలకు చాలా పెద్ద అనుమానం రాదా! ఎన్టీఆర్‌తో ముడిపడి ఉన్నది ప్రాంతీయ సిద్ధాంత సమస్య అయితే హిట్లర్‌తో ముడిపడి ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం, ప్రపంచ మానవాళి మనుగడతో ముడిపడి ఉన్న సమస్య. హిట్లర్ గురించి పాజిటివ్‌గా మాట్లాడేటప్పుడు ఈ సమస్య ఉంటుందని రేవంత్ రెడ్డికి తెలవదా!
కాంగ్రెస్‌ను అంతమొందించే ప్లానులో బీజేపీ ఉన్నప్పుడు..
ప్రస్తుత దశలో కాంగ్రెస్ పార్టీని అంతమొందించడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్లాను. ఆ విషయం మోదీ, అమిత్ షా 2014 నుంచి చెబుతున్నారు. ఇప్పడు ఆ మిషన్ పూర్తి చేసేందుకు ముందు కాంగ్రెస్‌తో అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తున్నారు. అందులో బీఆర్‌ఎస్ ఉందనేది మనకు తెలుసు. బీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకుని అది ముందు కాంగ్రెస్‌ను దెబ్బతీస్తుంది. ఆ తరువాత బీఆర్‌ఎస్ పనిపడుతుంది.
బీసీ నినాదంతో బండి సంజయ్‌లాంటి కట్టర్ ముస్లిం వ్యతిరేకిని ముఖ్యమంత్రిని చేసి సౌత్‌ను అధీనం చేసుకోవాలనేది వారి ఆలోచన. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వారి చేతిలోకి వెళ్లిపోయింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నామమాత్రులే. ఈస్థితిలో రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో, నిధుల పేరుతో సిద్ధాంతపరంగా వారికి ఉపయోగపడేవిధంగా మాట్లాడుతూపోతే నష్టం తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు. మొత్తం దేశం సంపూర్ణ మతవాదంలోకి లాగబడుతుంది. అది చుట్టూ ఉన్న ముస్లిం దేశాలనూ, ప్రపంచలోని క్రిస్టియన్ దేశాలను ఇండియాను థియోక్రాటిక్ రాజ్యంగా చూస్తాయి.
ఇండియాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ నాటో
ఇక్కడ బీజేపీ నాయకులు, అస్సాం, వెస్ట్ బెంగాల్‌లో అక్కడ ముఖ్యమంత్రులు చేసే ప్రతినిత్యం ముస్లిం వ్యతిరేక ప్రకటనలు ఇప్పటికే ఇండియాకు వ్యతిరేకంగా ఒక ఇస్లామిక్ నాటో ఫామ్ అయింది. సౌత్ ఇండియా కూడా వారి చేతుల్లోకి జారిపోతే దేశ భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుంది. ఇది అసలు భయం కలిగించాల్సిన సమస్య.
ఈ వ్యాసం నేను రేవంత్ రెడ్డి మీద కోపంతోనో లేక, ఇతర రాజకీయ శక్తులమీద కోపంతోనో రాస్తున్నది కాదు. ఈ దేశ భవిష్యత్ మీద ప్రేమతో రాస్తున్నాను. 2028లోనో, 2029లోనో వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతే దేశంలో కాంగ్రెస్ ఇంకా బలహీన పడుతుంది. ఇది గమనించే తనకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్‌ను కాపాడవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఆ కర్తవ్యాన్ని ఆయనకు గుర్తు చేయడానికే నేను ఈ వ్యాసం రాశాను.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
