- పూర్తి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే నిందితుడిని లైంగిక దాడికి బాధ్యుడిని చేయలేమన్న కోర్టు
- ప్రతిసారీ కేవలం పెళ్లి వాగ్దానం వల్లే అనే కారణాన్ని అంగీకరించడంకష్టమని వ్యాఖ్య
- పెళ్లి నిరాకరించాడనే కారణంతో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును కొట్టివేసిన న్యాయస్థానం
- అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ప్రయాగ్‌రాజ్: లివింగ్ రిలేషన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినంత మాత్రాన, ఇద్దరు మేజర్‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగిన సహజీవనాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొన్నది. కేవలం పెళ్లి మాట నిలబెట్టుకోలేదనే కారణంతో రేప్‌గా పరిగణించలేమని స్పష్టం చేసింది.
ఈ విధమైన సుదీర్ఘ సంబంధాలు విఫలమైనప్పుడు వాటిని క్రిమినల్ నేరాలుగా మార్చడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు నిందితుడిపై ఉన్న రేప్ సహా అన్ని క్రిమినల్ కేసులను కోర్టు పూర్తిగా కొట్టేసింది. నిందితుడు సంజయ్ సరోజ్ అలియాస్ సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ.. జస్టిస్ వివేక్ కుమార్ సింగ్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.
నిందితుడిపై కోపంతోనే ఎఫ్‌ఐఆర్
ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఇరువర్గాల వాదోపవాదాలు, పరిస్థితులు, రికార్డులను పరిశీలించి, వీరి మధ్య బంధం పరస్పర అంగీకారంతోనే ఏర్పడిందని స్పష్టం చేసింది. నిందితుడిపై ప్రాథమికంగా ఎలాంటి నేరం రుజువు కాలేదని పేర్కొన్నది. ఫిర్యాదుదారు శారీరక సంబంధం పెట్టుకోవడానికి పూర్తి అంగీకారం తెలిపినట్లయితే, నిందితుడిని అత్యాచారానికి బాధ్యుడిని చేయలేమని వ్యాఖ్యానించింది.
నిందితుడి ప్రవర్తనపై కోపంతోనే ఫిర్యాదుదారు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అంతేకానీ ఇక్కడ అత్యాచారం జరిగినట్టు ఆధారాలేమీ లేవని తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత బాధితురాలు నిందితుడిని వివాహం చేసుకోవడం గమనార్హమని, దీనిని బట్టి నిందితుడిని పెళ్లికి ఒప్పించేందుకే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు అర్థమవుతోందని పేర్కొన్నది. ఇది ‘అరుదైన వాటిలో అరుదైన’ కేసుల పరిధిలోకి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
అసలేం జరిగిందంటే..
ప్రయాగ్‌రాజ్‌లోని కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 376, 323, 504, 506 కింద కేసు నమోదైంది. ప్రతాప్‌గఢ్‌కు చెందిన బాధిత మహిళ.. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడానికి 2014లో ప్రయాగ్‌రాజ్ వచ్చారు. దూరం బంధువైన నిందితుడు ఆమె చదువుకు, వసతికి సహాయం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరై రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిందితుడు తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని మహిళ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది.
పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తనను కొట్టి, బెదిరించాడని పేర్కొన్నది. అంతేకాకుండా, నిందితుడు తనతో కలిసి ఉన్నప్పుడు ఆబ్జెక్షనబుల్ వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని దర్యాప్తులో ఆరోపించింది. అయితే, వైద్య పరీక్షల్లో ఆమెకు ఎలాంటి గాయాలైనట్లు తేలలేదు. పోలీసులు 2020లో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, మెజిస్ట్రేట్ 2021లో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు.
దీనిపై నిందితుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి, కేసును కొట్టేయాలని కోరారు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన బంధం విఫలమైతే దాన్ని అత్యాచారంగా మార్చడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని, ఇది కేవలం పరస్పర అంగీకారంతో సాగి ఆ తర్వాత చెడిపోయిన బంధం మాత్రమేనని స్పష్టం చేసింది.
