వరంగల్/జయశంకర్ భూపాలపల్లి/ పరకాల, వెలుగు: ‘జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు రావొచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, రిలీజ్ చేసుకోవచ్చు, కానీ సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకునేది లేదు’ అని టీఆర్‍ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శనివారం గ్రేటర్ వరంగల్ లో పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ అన్ ఫిట్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మాత్రం ఇక్కడి బిడ్డలే రాజకీయం చేయాలని తేల్చి చెప్పారు. ‘తెలంగాణ వరకు ఆయన ఓ సినిమా యాక్టర్.. మనకు ఒక ఎంటర్టైన్ మెంట్ ఫ్యాక్టర్’ అని అన్నారు. ఆంధ్రావాళ్లు సినిమా యాక్టర్ల ముసుగులో వచ్చి ఇక్కడ కబ్జాలు పెడుతారన్నారు.
సినిమాల్లో తెలంగాణ యాసను అవమానపరిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీగా మార్చిందని విమర్శించారు. ఉద్యమకారులు, జర్నలిస్టులను పట్టించుకోవట్లేదన్నారు. జులై 2న ఉప్పల్ భగాయత్‍లో ఉద్యమకారులకు స్థలాల కోసం పోరాటం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓరుగల్లులో కాకతీయ యూనివర్సిటీని పట్టించకోవట్లేదని, భద్రకాళి చెరువులో ప్రభుత్వమే కబ్జా పెట్టడంతో బొందివాగు లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదం ఏర్పడిందన్నారు. మామునూర్ ఎయిర్‍పోర్ట్ పేరుతో బీజేపీ లీడర్లు హడవుడి చేశారని ఎద్దేవా చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరాహార దీక్ష చేస్తా ప్రతినెలా రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్ లో ఉన్న 1,200 మంది కార్మికులను అన్ ఫిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుంటే గాంధేయ మార్గంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని కవిత హెచ్చరించారు. బొగ్గుబాయి బాట సందర్భంగా శనివారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గని వద్ద గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ... డిపెండెంట్ ఉద్యోగాలు పొందడం కార్మికుల హక్కు అని, అలాంటి ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులకు ప్రత్యేక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసి ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
