- మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క
యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : ‘గతంలో మగవాళ్లు ఇంటి యజమానులుగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఇండ్ల ఓనర్లు మనమే. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పథకాలలోనూ మహిళలకే ప్రాధాన్యతనిస్తోంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం సందర్భంగా దంపతులకు కొత్త దుస్తులు అందించడంతో పాటు యాట ఇచ్చారు.
అనంతరం ఆలేరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలు రూ. 58.58 కోట్ల చెక్కును అందించి మాట్లాడారు. మగవారి మీద ఆధారపడకుండా జీవించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకే ఇందిరమ్మ ఇండ్లకు, బస్సులు, పెట్రోల్ బంక్‌లకు మహిళలను ఓనర్లుగా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలకు రూ. 61 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్కు ఇందిరమ్మ పేరు పెట్టడంపై ప్రతిపక్షాలు విమర్శించడంపై స్పందిస్తూ ఇందిరమ్మ ఒంటరి మహిళ అయినప్పటికీ దేశ ప్రధానిగా పేదలకు సంక్షేమ పథకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల్లో ఇందిరమ్మ స్ఫూర్తి పెంచడానికే స్కీమ్స్కు ఆమె పేరు పెడుతున్నామన్నారు.
అప్పులు పాలు కావొద్దు..
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చి తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దని మంత్రి సీతక్క సూచించారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఇందుకు ములుగు జిల్లా ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో నిలవడం మంచి ఉదాహరణ అని తెలిపారు. అంతకుముందు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకున్నారు.
గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేసి ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా ఆయన పేరు మీద ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సామెల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్టేట్ విమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
