FIFA World Cup: అమెరికా అదరహో.. నాకౌట్‌‌‌‌ దశకు చేరిన హోమ్ టీమ్‌‌‌‌.. 2–0తో ఆస్ట్రేలియాపై విజయం

FIFA World Cup: అమెరికా అదరహో.. నాకౌట్‌‌‌‌ దశకు చేరిన హోమ్ టీమ్‌‌‌‌.. 2–0తో ఆస్ట్రేలియాపై విజయం

సియాటెల్‌‌‌‌‌‌: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో అమెరికా జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో నాకౌట్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌లో అమెరికా 2–0తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. సుదీర్ఘ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చరిత్రలో అమెరికా వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌లు గెలవడం 1930 తర్వాత ఇదే తొలిసారి.

స్టార్‌‌‌‌ ఫార్వర్డ్‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌ పులిసిక్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌కు దూరమైనా.. యూఎస్‌‌‌‌ ఏమాత్రం తడబడలేదు. మ్యాచ్‌‌‌‌ ప్రారంభమైన 11వ నిమిషంలోనే బలోగన్‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌ వింగ్‌‌‌‌ నుంచి అందించిన పాస్‌‌‌‌ను ఆస్ట్రేలియా డిఫెండర్‌‌‌‌ కామెరాన్‌‌‌‌ బర్గెస్‌‌‌‌ పొరపాటున తమ సొంత నెట్‌‌‌‌లోకి నెట్టేశాడు.

దాంతో యూఎస్‌‌‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. ఆట 43వ నిమిషంలో 21 ఏళ్ల అలెక్స్ ఫ్రీమాన్‌‌‌‌ హెడర్‌‌‌‌ ద్వారా అద్భుతమైన గోల్‌‌‌‌ చేసి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. వీడియో రివ్యూ తర్వాత ఈ గోల్‌‌‌‌ను ఖరారు చేశారు. సెకండాఫ్​లో ఆసీస్‌‌‌‌ పుంజుకోవడానికి ప్రయత్నించినా యూఎస్‌‌‌‌ డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. తొలి 45 నిమిషాల్లో యూఎస్‌‌‌‌ ప్లేయర్లు చూపిన ఆధిపత్యమే మ్యాచ్‌‌‌‌ ఫలితాన్ని శాసించింది. 

హైతీ ఔట్‌‌‌‌.. బ్రెజిల్‌‌‌‌ ముందుకు


ఫిలడెల్ఫియా: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఐదుసార్లు చాంపియన్‌‌‌‌ బ్రెజిల్‌‌‌‌ మరోసారి అద్భుతమైన ఆటతో చెలరేగింది. గ్రూప్‌‌‌‌-సి మ్యాచ్‌‌‌‌లో 3-0తో హైతీపై ఏకపక్ష విజయం సాధించింది. బ్రెజిల్‌‌‌‌ తరఫున స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ మాథ్యూస్‌‌‌‌ కున్హా (23, 36వ ని), వినిసియన్‌‌‌‌ జూనియర్‌‌‌‌ (45+3వ ని) గోల్స్‌‌‌‌ కొట్టారు.

తాజా ఓటమితో హైతీ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. మొరాకోతో మ్యాచ్‌‌‌‌ను 1-1తో డ్రా చేసుకున్న బ్రెజిల్‌‌‌‌ ఈసారి సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగింది. సబ్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌గా వచ్చిన కున్హాను ఆరంభం నుంచే గ్రౌండ్‌‌‌‌లోకి దించాడు. దాంతో తొలి హాఫ్‌‌‌‌లోనే బ్రెజిల్‌‌‌‌ పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. వినిసియస్ జూనియర్ కొట్టిన షాట్‌‌‌‌ను హైతీ గోల్‌‌‌‌కీపర్ జానీ ప్లాసైడ్ అడ్డుకున్నప్పటికీ.. రీబౌండ్ అయిన బంతిని కున్హా సమయస్ఫూర్తితో గోల్‌‌‌‌గా మలిచాడు.

దీంతో బ్రెజిల్ 1-0తో ముందంజ వేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వినిసియస్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌‌‌‌ను కున్హా ఎడమకాలితో నెట్‌‌‌‌లోకి పంపి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కున్హా తన ట్రేడ్‌‌‌‌మార్క్ 'సర్ఫింగ్' స్టెప్పులతో మైదానంలో సందడి చేశాడు. మొదటి హాఫ్ ముగిసే సమయానికి వినిసియస్ జూనియర్ స్వయంగా మరో గోల్ చేయడంతో బ్రెజిల్ 3-0తో తిరుగులేని స్థితికి చేరింది.