వనపర్తి/గద్వాల/సిద్దిపేట టౌన్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో వేలాది కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి, ఆత్మకూరు కోర్టుల్లో సీనియర్ సివిల్ జడ్జి జి. కళార్చన పర్యవేక్షణలో 11 సివిల్, 1,527 క్రిమినల్, 3,726 ప్రీ లిటిగేషన్ సహా మొత్తం 5,264 కేసులు పరిష్కారమయ్యాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ నేతృత్వంలో మోటార్ ప్రమాద, బ్యాంకు రుణాలు, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలకు సంబంధించిన రికార్డు స్థాయి 7,046 కేసులు ముగిశాయి. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. సాయి రమాదేవి, సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. సంతోష్ కుమార్‌లతో కలిసి నిర్వహించిన అదాలత్‌లో 5,420 క్రిమినల్, 27 సివిల్ సహా మొత్తం 5,447 కేసులను పరిష్కరించి, బాధితులకు రూ. 82 లక్షలకు పైగా పరిహారం అందజేశారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
తొగుట (దుబ్బాక) వెలుగు: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
