- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
జమ్మికుంట, వెలుగు: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఆదాయం పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధి జమ చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకేలో శనివారం నిర్వహించిన 23వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా జమ చేశామని తెలిపారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచామని, వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం రూ.11 లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు. యూరియా బస్తా మార్కెట్ ధర రూ.2,400–2,700 వరకు ఉండగా సబ్సిడీపై రూ.266కే అందిస్తున్నామని తెలిపారు. అలాగే డీఏపీ ఎరువును భారీ సబ్సిడీతో రైతులకు ఇస్తున్నామన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్, మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ అభివృద్ధికి రూ.840 కోట్లు..
కరీంనగర్ టౌన్: కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని బండి సంజయ్ తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. శనివారం నగరంలోని 50వ డివిజన్‌లో రూ.67 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు 26వ డివిజన్‌లో రూ.30.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
