- ప్రజలు నాలాల్లో చెత్త వేయొద్దు
- హైడ్రా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌ల సమావేశంలో మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం జలవిహార్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల రోజుల్లో పడాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురుస్తున్న తరుణంలో.. రాబోయే 150 రోజులపాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, ఫైర్, వాతావరణ శాఖలు 24 గంటలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని, నాలాల్లో చెత్త వేయొద్దని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువుల సంరక్షణలో హైడ్రా తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల కోసం 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, 3,600 మంది సిబ్బందితో కూడిన 300 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, 889 స్టాటిక్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విరిగిపడిన చెట్లను తొలగించేందుకు 20 బైక్ క్విక్ రెస్పాన్స్ యూనిట్లు, నీటిని తోడేందుకు 371 డీ-వాటరింగ్ పంపులను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. 60 ఫ్లైఓవర్లు, 38 అండర్‌పాస్‌లు, 705 చెరువులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆర్.సుదర్శన్, అడిషనల్డైరెక్టర్ వర్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
