నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను స్పీడప్చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పూర్తి చేయాలని ఆర్‌అండ్‌ఆర్, ల్యాండ్ అక్విజిషన్, ఇరిగేషన్ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కలెక్టర్ బి.చంద్రశేకర్ అధ్యక్షతన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రాజెక్టుల వారీగా పురోగతిని పరిశీలించారు.
భూసేకరణ పూర్తయి అవార్డులు పాస్ అయినందున ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలలో లే-అవుట్లు రూపొందించి మౌలిక వసతుల కల్పనను స్పీడప్ చేయాలని చెప్పారు. భూసేకరణ, నిర్మాణ పనులను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.
