10 వేల పరుగుల మార్కును దాటిన మిథాలీ రాజ్

10 వేల పరుగుల మార్కును దాటిన మిథాలీ రాజ్

టీమిండియా మొదటి మహిళా వన్డే జట్టు సారథి మిథాలి రాజ్‌ రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు సాధించిన మిథాలి.. అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప మైలురాయికి చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలి (36 : 50 బంతుల్లో 4 x 4) పరుగులు చేసి అన్నేబాష్‌ బౌలింగ్‌లో ఓటమిపాలయ్యింది. ఈ క్రమంలోనే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 10వేల పరుగుల మార్కును  చేరుకుంది.

1999 లో టీమిండియాలోకి అడుగుపెట్టిన మిథాలి సుదీర్ఘకాలంగా భారత క్రికెట్‌లో కొనసాగుతున్నారు. 2002 లో టెస్టుల్లో అడుగుపెట్టిన ఆమె 10 ఆటలాడి 663 పరుగులు చేసింది. అందులో ఒక సెంచరీ, నాలుగు ఆఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డే కెరీర్‌లో 212 మ్యాచ్‌లాడిన మిథాలి 6,974 (ఈ మ్యాచ్‌తో కలిపి) పరుగులు సాధించారు. అందులో ఏడు సెంచరీలు, 54 ఆఫ్ సెంచరీలున్నాయి.

మరోవైపు టి 20 క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడగా 2,364 పరుగులను సాధించారు. ఇక్కడ 17 అర్ధశతకాలు సాధించి ఘనత సాధించారు.