ఎన్నికల్లో ప్రచారం.. ప్రాథమిక హక్కు కాదు : ఈడీ

ఎన్నికల్లో ప్రచారం.. ప్రాథమిక హక్కు కాదు : ఈడీ
  • కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దు: కోర్టులో ఈడీ వాదన
  • మధ్యంతర బెయిల్ పై ఇయ్యాల సుప్రీంలో విచారణ 

న్యూఢిల్లీ:  రాజకీయ నాయకులు ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక, రాజ్యాంగపరమైన లేదా చట్టబద్ధమైన హక్కు కాదని ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. ఢిల్లీ లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌‌‌‌ పిటిషన్​పై శుక్రవారం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. ఆయన పిటిషన్‌‌‌‌ను వ్యతిరేకిస్తూ  ఈడీ గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. 

ప్రచారం కోసం ఇప్పటివరకు ఏ నాయకుడికి బెయిల్ ఇవ్వలేదని తెలిపింది. గత ఐదేండ్లలో 123 ఎన్నికలు జరిగాయని.. ఏడాది పొడవునా ఏదో ఒక ఎన్నిక జరుగుతున్నందున  ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇస్తూ పోతే ఏ లీడర్ నూ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని ఈడీ వాదించింది. ప్రస్తుత ఎన్నికల్లో కేజ్రీవాల్ ​పోటీ కూడా చేయడం లేదని తెలిపింది. ఆయనకు బెయిల్ ఇస్తే.. లీడర్లు నేరాలకు పాల్పడటానికి పర్మిషన్​ ఇచ్చినట్టు అవుతుందని, వారు ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికకు ప్రచారం చేస్తూ దర్యాప్తు నుంచి తప్పించుకుంటారని పేర్కొంది. 

నేడు చార్జిషీట్ వేయనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్​ స్కాం మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌‌‌‌పై  ఈడీ శుక్రవారం మొదటి చార్జ్​షీట్ దాఖలు చేసేందుకు రెడీ అయింది. ఈ కేసులో కేజ్రీవాల్‌‌‌‌ను తొలిసారి నిందితుడిగా చేర్చనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌‌‌‌కు మధ్యంతర బెయిల్‌‌‌‌ మంజూరుపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈడీ చార్జ్​షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అంతేకాకుండా.. ఈ కేసులో కేజ్రీవాల్‌‌‌‌ను ‘కింగ్‌‌‌‌పిన్‌‌‌‌’ గా పేర్కొంటూ చార్జ్​షీట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.