మిజోరంలో జెడ్పీఎం జెండా.. 27 స్థానాలతో క్లియర్​ మెజార్టీ

మిజోరంలో జెడ్పీఎం జెండా.. 27 స్థానాలతో క్లియర్​ మెజార్టీ
  •     సీఎం, డిప్యూటీ సీఎం సహా9 మంది మంత్రులు ఇంటికి
  •     కాంగ్రెస్ ​పార్టీకి తగ్గిన సీట్లు.. బీజేపీకి ఒకటి పెరుగుదల

ఐజ్వల్ :  మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరం పీపుల్స్​మూవ్​మెంట్(జెడ్పీఎం) జయకేతనం ఎగురవేసింది. అధికార మిజో నేషనల్‌‌ ఫ్రంట్‌‌(ఎంఎన్ఎఫ్)ను చిత్తుగా ఓడించి 27 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 40 స్థానాలకు గానూ జడ్పీఎం 27, ఎంఎన్ఎఫ్10, బీజేపీ 2, కాంగ్రెస్‌‌ ఒక స్థానంలో గెలుపొందాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 21 స్థానాలు అవసరం కానుండగా.. లాల్‌‌దుహోమా నేతృత్వంలోని జడ్‌‌పీఎం స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది.

హోరాహోరీ పోరు

మిజోరంలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎంఎన్‌‌ఎఫ్‌‌ సహా, జెడ్పీఎం, కాంగ్రెస్‌‌ రాష్ట్రంలోని 40 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. తొలిసారిగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. వీరితోపాటు మరో17 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్​7న పోలింగ్​ నిర్వహించగా.. సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈసారి నెక్​ టు నెక్​ ఫైట్​ఉంటుందని, ఎంఎన్ఎఫ్​ గెలుస్తుందని కొన్ని, 
జెడ్పీఎం గెలుస్తుందని ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ అంచనా వేశాయి. అనూహ్యంగా అధికార పార్టీ ఎంఎన్ఎఫ్​ను ఓడించిన జెడ్పీఎం.. 27 స్థానాల్లో విజయం సాధించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్​26 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో జెడ్పీఎంకు 8, కాంగ్రెస్‌‌కు 5 స్థానాలు 
దక్కాయి. బీజేపీ ఒక చోట విజయం సాధించింది.

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఓటమి

ఈ ఎన్నికల్లో ఎంఎన్‌‌ఎఫ్‌‌ అధ్యక్షుడు, సీఎం జోరంథంగా ఐజ్వాల్‌‌ తూర్పు-1 స్థానంలో ఓడిపోయారు. జెడ్పీఎం అభ్యర్థి లాల్తన్‌‌సంగా చేతిలో 2100 ఓట్ల తేడాతో సీఎం ఓటమి పాలయ్యారు. తుయ్‌‌చాంగ్‌‌ నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాన్‌‌లుయా కూడా జెడ్పీఎం అభ్యర్థిపై 909 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బరిలో నిలిచిన11 మంది మంత్రుల్లో 9 మంది ఓడిపోయారు.

నేడు ఎమ్మెల్యేలతో జెడ్పీఎం చీఫ్ ​భేటీ

ఎన్నికైన ఎమ్మెల్యేలతో జెడ్పీఎం అధ్యక్షుడు లాల్‌‌దుహోమా మంగళవారం ఐజ్వాల్​లో సమావేశం కాబోతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కె.సప్దంగా సోమవారం తెలిపారు. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ప్రభుత్వం ఏర్పాటు గురించి బుధవారం గవర్నర్​ను కలిసే అవకాశం ఉందని, ప్రమాణ స్వీకారం గురు లేదా శుక్రవారం ఉండొచ్చన్నారు. కాగా, సెర్చిప్‌‌ స్థానం నుంచి 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మాజీ ఐపీఎస్​ఆఫీసర్, జెడ్పీఎం అధ్యక్షుడు లాల్‌‌దుహోమా మిజోరం తదుపరి సీఎం కాబోతున్నట్లు తెలుస్తున్నది.

ఐపీఎస్ నుంచి సీఎం వరకు..

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో తొలిసారి అధికారం చేపట్టేందుకు 'జోరామ్ పీపుల్స్ మూవ్‌‌మెంట్ (జెడ్పీఎం) సిద్ధమైంది. రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి (1987) అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్ మాత్రమే గెలిచాయి. ఈ ఆధిపత్యానికి తెరదించుతూ.. జెడ్పీఎంకు అధికారం కట్టబెట్టిన లాల్‌‌దుహోమా(73 ) పేరు ప్రస్తుతం మార్మోగుతున్నది. మాజీ ఐపీఎస్ అయిన లాల్‌‌దుహోమా గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌‌చార్జ్‌‌గా పనిచేశారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద  అనర్హతకు గురైన తొలి ఎంపీగా అపవాదును మూటగట్టుకున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బరిలోకి దిగి గెలుపోటములను తట్టుకున్నారు. ఎట్టకేలకు మూడున్నర దశాబ్దాల తర్వాత జెడ్పీఎంను అధికారానికి దగ్గర చేశారు. మిజోరం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.