
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలకు దిగారు. జీహెచ్‌ఎంసీ నిధులను కేసీఆర్ ఎంఐఎం కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే బడుగులు, రైతులపై ముఖ్యమంత్రికి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోందన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
‘రాష్ట్రంలోని ఎమ్యేలందరూ రాజీనామా చేయాలని ప్రజలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నరు. నా నియోజకవర్గమైన గోషామహల్ ప్రజలు కూడా రాజీనామా చేయాల్సిందిగా నాపై ఒత్తిడి తీసుకొస్తున్నరు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేయడానికి నేను రెడీ. అయితే ఈ నియోజకవర్గానికి కేసీఆర్ వేల కోట్ల నిధులివ్వాలి. ఆయన ఫండ్స్ ఇస్తానంటే నేను రాజీనామా చేస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు రూ.10 లక్షలు ఇవ్వాలి. సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలసి రాజీనామా లేఖ ఇస్తా. గోషామహల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం’ అని కేసీఆర్‌కు రాజా సింగ్ సవాల్ విసిరారు.