వెనక్కి తగ్గకండి.. భారీ సహయం అందబోతుంది: ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ సంచలన పిలుపు

వెనక్కి తగ్గకండి.. భారీ సహయం అందబోతుంది: ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ సంచలన పిలుపు

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. ఖమేనీ ప్రభుత్వంపై నిరసన కొనసాగించాలని.. పోరాటంలో వెనక్కి తగ్గొద్దని సూచించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఫ్లాట్ ఫామ్‎లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇరానియన్ దేశభక్తులారా నిరసనలు కొనసాగించండి. - ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి. మిమ్మల్ని చంపేవారి, ఇబ్బందులు పెట్టే వారి పేర్లను నోట్ చేసుకోండి. వాళ్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు. నిరసనకారులపై మారణహోమం ఆపేవరకు ఇరాన్ అధికారులతో అన్ని మీటింగ్‎లు క్యాన్సిల్ చేసుకున్నా. మీకు త్వరలోనే సహయం అందబోతుంది. మేక్ ఇరాన్ గ్రేట్ ఏగైన్ (మిగా)’’ అంటూ ట్రంప్ పోస్ట్‎లో రాసుకొచ్చారు.

ఇరాన్‎లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం మరోవైపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రెండు వారాల నుంచి కొనసాగుతోన్న ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. మొదటి రాజధాని నగరం టెహ్రాన్‎లో మొదలైన నిరసన జ్వాలలు రోజుల వ్యవధిలోనే దేశమంతటా విస్తరించాయి.

మరోవైపు నిరసనకారులను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణివేస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ అల్లర్లలో 2 వేల మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అనధికారికంగా ఈ లెక్క ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న ఆందోళనకారులపై ఖమేనీ ప్రభుత్వం బలప్రయోగం చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రోజురోజుకు నిరసనకారులపై దాడులు పెరిగిపోవడంతో ఇరాన్‎పై అమెరికా దాడులకు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నిరసన కొనసాగించండి.. త్వరలోనే సహయం అందబోతుందని ఇరాన్ ఆందోళకారులకు ట్రంప్ పిలువునివ్వడం ప్రపంచదేశాల్లో చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులకు సహయం అందిస్తామని చెప్పి ఇరాన్ పై దాడి చేయబోతున్నామని పరోక్షంగా ట్రంప్ హింట్ ఇచ్చారని గ్లోబల్ పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రకటనతో ఏ క్షణాన ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.