Anil Ravipudi : చిరంజీవి కోసం 25 రోజుల్లోనే స్క్రిప్ట్ రాశా.. 'మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్యూ మీట్' లో అనిల్ రావిపూడి ఎమోషనల్!

Anil Ravipudi : చిరంజీవి కోసం 25 రోజుల్లోనే  స్క్రిప్ట్ రాశా.. 'మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్యూ మీట్' లో అనిల్ రావిపూడి ఎమోషనల్!

ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపించేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్రం జనవరి 12న విడుదలైంది . పాజిటివ్ టాక్ తో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నయనతార కథానాయికగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను, మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం మంగళవారం ( జనవరి 13, 2026 ) 'మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్యూ మీట్' నిర్వహించింది.

25 రోజుల్లోనే మెగా స్క్రిప్ట్!

ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ  'మన శంకరవరప్రసాద్‌గారు' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా నా సినిమాలకు స్క్రిప్ట్ రాయడానికి 3 నెలలకు పైగా సమయం పడుతుంది. కానీ, చిరంజీవి మీద ఉన్న అభిమానం, ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ఉన్న అవగాహన వల్ల కేవలం 25 రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశానని తెలిపారు. మొదటి భాగం 15 రోజులు, సెకండాఫ్ 10 రోజుల్లో రాశాను. చిరంజీవి వెండితెరపై నవరసాలను పండించగల గొప్ప నటుడు. ఆయన గ్రేస్, బాసిజం, ఎమోషన్స్ తెలిసిన వాడిని కాబట్టి, ఆయా సన్నివేశాల్లో ఖాళీలను పూరిస్తూ వెళ్లానంతే అని చెప్పుకొచ్చారు. 85 రోజుల షూటింగ్ పీరియడ్ తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని అనిల్ ఎమోషనల్ అయ్యారు.

త్రివేణి సంగమం

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యారు, ఒక బస్సు డ్రైవర్ కొడుకు అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ అయ్యారు, ఒక రైతు కొడుకునైన నేను వారితో కలిసి పనిచేశాను. ఇది కర్షకుడు, కార్మికుడు, రక్షకుడు కలిసిన త్రివేణి సంగమంలా అనిపిస్తోంది అంటూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. భీమ్స్ అందించిన బాణీలు, ముఖ్యంగా చిరంజీవి మార్క్ సాంగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి.

చిరంజీవి అంటే ఒక ఎమోషన్!

రచయిత అజ్జు మాట్లాడుతూ.. తెలుగు వారి ఇళ్లలో చిరంజీవి పాట వినపడకుండా రోజు గడవదు. ఆయన సినిమాకు డైలాగ్స్ రాయడం అంటే శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం అని అభివర్ణించారు. సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ అంతా వెళ్లాల్సిందే అనే నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డు..
ఈ సినిమా కథ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. తన నుండి విడిపోయిన భార్య, పిల్లలను ఒక పగతో రగిలిపోయే మాజీ పోలీసు అధికారి నుండి కాపాడడమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్, హ్యూమర్, మాస్ యాక్షన్‌తో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. చిరంజీవి భార్యగా తన నటనతో సినిమాకు హుందాతనాన్ని తెచ్చారు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ గెస్ట్ అప్పీరెన్స్ ప్రేక్షకులకు అసలైన ఐ-ఫీస్ట్. చిరు, వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోవడం థియేటర్లలో విజిల్స్ వేయిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు, మొదటి రోజు కలిపి రూ.84 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ అద్భుతమైన వసూళ్లతో మెగాస్టార్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది.

దర్శకుడిగా అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్, కామెడీ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు..  సంక్రాంతి రేసులో 'మన శంకరవరప్రసాద్‌గారు' విజేతగా నిలవడమే కాకుండా, చిరంజీవి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోందంటున్నారు అభిమానులు..