హైదరాబాద్: నిరుద్యోగులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గుడ్ న్యూస్ చెప్పారు. వైద్యారోగ్య శాఖలో త్వరలోనే మరిన్నీ జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖలో గత రెండేళ్లలోనే సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఇంకో 7 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని చెప్పారు. మంగళవారం (జనవరి 13) సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని.. ఎలక్ట్రికల్ వర్క్స్ కొన్ని పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, ఇతర ఎక్విప్‌మెంట్ ఏర్పాటు కూడా చివరి దశలో ఉందన్నారు. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్ పూర్తయిందని తెలిపారు. మాది ప్రచార ఆర్భాటం ఉండదని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే మా ఆరాటమని పేర్కొన్నారు. అన్నిరకాలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి పేషెంట్లకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
వెయ్యి బెడ్ల ఈ హాస్పిటల్‌లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా సనత్‌నగర్ టిమ్స్ ఉంటుందని.. ఇక్కడే అవసరమైన రీసెర్చ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడే అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నిరకాల అవయవమార్పిడి సర్జరీలు చేసేలా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో తెస్తున్నామన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండదని తెలిపారు.
