Movie Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫుల్ రివ్యూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్తో రవితేజ కం బ్యాక్ ఇచ్చాడా?

Movie Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫుల్ రివ్యూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్తో రవితేజ కం బ్యాక్ ఇచ్చాడా?

ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ మంగళవారం (2026 జనవరి 13న) ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వరుస మాస్ పాత్రలతో ఫెయిల్యూర్స్తో సతమవుతున్న రవితేజ, ఈ సినిమాతో క్లాసికల్ ఫ్యామిలీ మెన్గా వచ్చాడు. అందులో భాగంగా రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు తీసుకొచ్చాడు. అలాగే, సింపుల్ ప్రొఫైల్ మెయింటేన్ చేసే డైరెక్టర్ కిశోర్ తిరుమల సైతం ప్రమోషన్లలో తనదైన డ్యాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి భారీ అంచనాలు మోసుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ఎలా ఉంది? ఈ సినిమాతో అయినా రవితేజ కం బ్యాక్ ఇచ్చాడా? లేదా అనేది రివ్యూలో చూద్దాం  

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ:

రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ కంపెనీకి యజమాని. తన భార్య బాలమణి (డింపుల్ హయాతి)తో సంతోషంగా కుటుంబ జీవితం గడుపుతూ ఉంటాడు. బాలమణి తన భర్తపై అపారమైన ప్రేమతో పాటు, అతను ఎప్పటికీ తప్పు చేయడు అనే గట్టి నమ్మకంతో జీవిస్తుంది.

ఇలాంటి సమయంలో వ్యాపార పనుల నిమిత్తం రామ్ స్పెయిన్‌కి వెళ్తాడు. అక్కడ జరిగిన అనుకోని సంఘటనల మధ్యలో మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. మానస ముందు రామ్ తన అసలు పేరు చెప్పకుండా “సత్య”గా పరిచయం అవుతాడు. క్రమంగా వారి మధ్య బాండింగ్ పెరిగి, ఒక ఊహించని తప్పుకు దారి తీస్తుంది.

►ALSO READ | Youth Congress: శివకార్తికేయన్ ‘పరాశక్తి మూవీని బ్యాన్ చేయండి.. ఇందిరాగాంధీ సీన్లపై కాంగ్రెస్ ఆగ్రహం!

అనుకోకుండా చేసిన పొరపాటు రామ్ అలియాస్ (సత్య) జీవితాన్ని ఎలా తలకిందులుగా మార్చింది? మానసతో రామ్ నడిపించిన యవ్వారం భార్య బాలమణికి తెలిసిందా? తెలిస్తే బాలమణి ఎలా స్పందించింది? చివరకు ఓవైపు ఇల్లాలు, మరోవైపు ప్రియురాలు మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ ఎలా హ్యాండిల్ చేశాడు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, మూవీ థియేటర్లో చూడాల్సిందే. 

విశ్లేషణ:

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన సినిమా ఇది. రవితేజ మార్క్ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు కిశోర్ తిరుమల కథను నడిపించారు. కథలో లాజిక్‌ కన్నా వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది.

రామ్ పాత్రలో రవితేజ ఒక హ్యాపీ మ్యారెడ్ మ్యాన్‌గా కనిపిస్తాడు. వ్యాపార పనుల నిమిత్తం స్పెయిన్‌కి వెళ్లి అక్కడ మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో ఏర్పడే సంబంధం కథకు ఆసక్తిని తీసుకొస్తుంది. ఒకవైపు భార్య, మరోవైపు ప్రియురాలు...ఈ రెండు భావోద్వేగాల మధ్య ఇరుక్కొన్న రామ్, గైడెన్స్ కోసం ఒక సైకాలజిస్ట్ (మురళీధర్ గౌడ్)ను కలుస్తాడు. అక్కడి నుంచి వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన కామెడీ బలం. హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ స్టైలిష్‌గా కనిపిస్తూ తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు.

ఇందులో ర‌వితేజ కొత్త‌గా క‌నిపించారు. ఆయ‌న లుక్, పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు, అల‌వోకగా ఆయ‌న పంచిన వినోదం తీరు బాగుంది. ఆయ‌న గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇది ఎంతో ఉప‌శ‌మ‌నం. స్పెయిన్ నేప‌థ్యంలో క‌థ మొద‌ల‌వుతుంది. స‌త్య‌, వెన్నెల కిశోర్‌, సునీల్ త‌దిత‌రులతో ర‌వితేజ చేసే హంగామా బాగా న‌వ్విస్తుంది. మాన‌స శెట్టి ఇండియాకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సినిమా మ‌రింత సంద‌డిగా మారిపోతుంది. ఇంటర్వెల్ వ‌ర‌కూ సినిమా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఆ త‌ర్వాతే క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ తగ్గింది.

సెకండాఫ్లో బలమైన ఎపిసోడ్స్ పెద్దగా కనిపించవు. అయితే, ఇద్దరి భామల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్యకు భయపడేవాడే భర్త, ప్రేయసికి లొంగిపోయే ప్రియుడు వంటి స‌మ‌స్య‌కు... ఓ కొత్త ప‌రిష్కారాన్ని చూపించాడు డైరెక్టర్ కిశోర్. ఇలా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ద్వారా హీరో రవితేజతో ఓ కొత్త విష‌యాన్ని చెప్పించి క‌థ‌ని ముగించారు.

అయితే, క్లైమాక్స్ ఇంకా బలంగా ఉండాల్సి ఉంది. సత్య, సునీల్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్... ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధి మేరకు నవ్వించారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో బలమైన కథ, కథనాలు లేవు. అయినప్పటికీ.. సినిమాని పొంగల్ విందుగా ఎంజాయ్ చేయొచ్చు.

ఎవరెలా నటించారంటే:

మాస్ మహారాజా రవితేజ.. ఈ సినిమాలో తన హుషారైన నటనతో ఆకట్టుకున్నాడు. రామ్ పాత్రలో సహజంగా ఒదిగిపోయి, ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా తనదైన టైమింగ్‌తో నవ్వులు పండించాడు. తన కామెడీ ట్రాక్‌తో వింటేజ్ రవితేజ ఫీలింగ్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. సాంగ్స్‌లో అయితే, డ్యాన్స్ ఫ్లోర్‌పై హై ఎనర్జీతో దుమ్మురేపుతూ ఫ్యాన్స్లో జోష్ తీసుకొచ్చాడు. 

డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ తమ పాత్రల్లో బాగానే ఇంప్రెస్ చేశారు. ఆషికా ట్రెండీ లుక్‌తో ఇంప్రెస్ చేస్తే, డింపుల్ ఫ్యామిలీ రోల్ లో ఆకట్టుకుంది. ‘వామ్మో వాయ్యో’ పాటలో ఇద్దరి స్టెప్పులు థియేటర్లో విజిల్స్ పడేలా రంగుల పండుగలా మార్చేశారు.

ఇక సునీల్, వెన్నెల కిశోర్, సత్య, మురళీధర్ గౌడ్, రోహన్.. ఇలా ఈ టీమ్ మొత్తం స్క్రీన్ మీద నవ్వుల తుఫాన్ రేపారు. వారి టైమింగ్, డైలాగ్స్, రియాక్షన్స్.. ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయి.

టెక్నీకల్ అంశాలు:

సాంకేతికంగా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మంచి ఎనర్జీని అందించింది. పాటలుస్క్రీన్ పై హై ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. స్పెయిన్ నేప‌థ్యంలో సాగే ప్ర‌సాద్ మూరెళ్ల విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. భీమ్స్ పాట‌లు, ప్రసాద్ మూరెళ్ల  సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఒకే. డైరెక్టర్ కిశోర్ తిరుమ‌ల కామెడీతో మెప్పించారు. కథతో కొంచెం డిస్సపాయింట్ చేశారు.