హైదరాబాద్: హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా రీఫిల్లింగ్ స్టేషన్ సమీపంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
