Mustafizur Rahman: ముస్తాఫిజుర్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు..? రిపోర్టర్‌పై మండిపడిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్

Mustafizur Rahman: ముస్తాఫిజుర్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు..? రిపోర్టర్‌పై మండిపడిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్

ఫ్రాంచైజ్ లీగ్‌లలో మ్యాచ్ తర్వాత జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు సాధారణం. పిచ్ పరిస్థితులు, మ్యాచ్‌లోని టర్నింగ్ పాయింట్‌లు, వ్యక్తిగత ప్రదర్శనల గురించి చర్చిస్తూ ఉంటారు. కానీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సమయంలో ఇటీవల మీడియాతో జరిగిన సంభాషణలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీని ఒక రిపోర్టర్ ముస్తాఫిజుర్ గురించి అడగడంతో ఈ ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తల పరిస్థుతుల గురించి తాను స్పందించాల్సిన అవసరం లేదని ఘాటుగా చెప్పుకొచ్చాడు.  

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ నబీకి రిపోర్టర్ చికాకు తెప్పించాడు. అక్కడ జరుగుతున్న టోర్నీ గురించి కాకుండా ముస్తాఫిజుర్ ఎదుర్కొంటున్న పరిస్థితిపై నబీని తన అభిప్రాయం గురించి అడిగారు. దీనికి సహనం కోల్పోయిన ఈ ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ అందుకు తగ్గట్టుగా సమాధానం చెప్పాడు. నబీ మాట్లాడుతూ " ఇది నాకు సంబంధం లేని ప్రశ్న. ముస్తాఫిజుర్‌ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు?. అతను మంచి బౌలర్ అని నాకు తెలుసు. కానీ మీ ప్రశ్న నాకు సంబంధం లేదు". అని ఘాటుగా సమాధానమిచ్చాడు.

అసలేం జరిగిందంటే..?
 
ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ తప్పించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌‌‌‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వేలంలో ముస్తాఫిజుర్‌‌‌‌ను రూ. 9.20 కోట్లకు నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ దక్కించుకుంది. అయితే ప్రస్తుతం బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతన్ని ఐపీఎల్‌‌‌‌ నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. ముస్తాఫిజుర్‌‌‌‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ.. నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ను కోరింది. దాని ప్రకారమే అతన్ని రిలీజ్‌‌‌‌ చేశారు. ఇదిలా ఉంటే ముస్తాఫిజుర్ ను తప్పించడం పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనంగా ఉంది. ఇండియా వేదికగా వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఆడేది లేదని చెప్పింది.