ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్

ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్
  • ఓసీలతో పాటు .. బీసీలకూ 50 వేలు 
  • ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్ 
  • ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు మొదలైన దరఖాస్తులు.. 
  • ఈ నెల 25 వరకు చాన్స్ 
  • పార్టీ జంప్ కాబోమంటూ అఫిడవిట్ మస్ట్ 
  • తొలి అప్లికేషన్ వేసిన మానవతారాయ్ 

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఓసీలతో పాటు బీసీ అభ్యర్థులకూ రూ.50 వేలుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25 వేలుగా ఫిక్స్ చేసింది. శుక్రవారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తదితరులు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఫీజు వివరాలను విడుదల చేశారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు నిర్ణీత ఫీజు డీడీ రూపంలో చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ సూచించింది. అప్లికేషన్లకు ఈ నెల 25 వరకు గడువు ఉంటుందని పేర్కొంది. 

ఈసారి దరఖాస్తుతో పాటు పార్టీ మారబోమంటూ అభ్యర్థులు హామీ పత్రం ఇవ్వాలంటూ రూల్ పెట్టింది. చాలామంది గెలిచిన తర్వాత వేరే పార్టీల్లోకి జంప్ అవుతుండడంతో ఈసారి అఫిడవిట్ తప్పనిసరి చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలని సీరియస్​గా ఉన్న నేతలకే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఫీజులు నిర్ణయించినట్టు తెలిపాయి. గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్​కుమార్, వంశీచంద్​రెడ్డి, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్​ గౌడ్ ​తదితరులు పాల్గొన్నారు. 

అప్లికేషన్లు షురూ.. 

ఫీజులు ఖరారు కావడంతో శుక్రవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కోటూరి మానవతారాయ్ తొలి దరఖాస్తు సమర్పించారు. అప్లికేషన్ ఫామ్ కు ఆయన పూజలు చేయించి, మొదట రేవంత్​రెడ్డికి అందించారు. ఆ తర్వాత మహేశ్​కుమార్ గౌడ్​కు సమర్పించారు. సత్తుపల్లిలో పర్యటించాలని రేవంత్​ను మానవతారాయ్ ఆహ్వానించారు. అయితే మొదటి రోజు అప్లికేషన్ ఫామ్స్ అభ్యర్థులకు అందుబాటులోకి రాలేదు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు పీడీఎఫ్​లో షేర్​చేసిన ఫామ్​ను ప్రింట్​ తీసుకున్నారు. పలువురు అభ్యర్థులు ముహూర్తం టైమ్ చూసుకుని దరఖాస్తు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ‘‘సాయంత్రం 5 గంటల వరకు నా పేరు మీద మంచి టైమ్ నడుస్తున్నది. ఆలోపు దరఖాస్తు అందజేస్తాను’’ అని శుక్రవారం గాంధీ భవన్​లో ఓ ఆశావహుడు మాట్లాడడం కనిపించింది.

ఫీజుపై బీసీల అసంతృప్తి.. 


అప్లికేషన్​ విధివిధానాలకు సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చైర్మన్​గా సబ్ కమిటీ వేశారు. అన్ని వర్గాలతో చర్చించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు, ఓసీలకు రూ.50 వేలుగా కమిటీ ఫీజు నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు నివేదించగా, బీసీలకూ రూ.50 వేలు ఫీజు పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీలకూ ఫీజు పెంచినట్టు చెబుతున్నారు. దీనిపై కొందరు బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సీట్లు ఎక్కువ కావాలని అడుగుతుంటే, మరోవైపు ఓసీలకు సమానంగా ఫీజు ఖరారు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.