- ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
గడువు ముగియడానికి దగ్గరలో ఉన్న మందులను భారీగా కొనుగోలు చేసి.. వాటిని రోగులకు ఇవ్వకుండా స్టోర్ రూముల్లో మూలనపడేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత బయోమెడికల్ వేస్ట్‌గా డిస్పోజ్ చేయడానికి మళ్లీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, డాక్టర్లు కూర్చోవడానికి గదుల్లేవని, పేషెంట్లను కారిడార్లలోనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారన్నారు. గర్భిణులు డెలివరీ కోసం కావాల్సిన సామగ్రిని బయట నుంచి కొనుక్కు రావాల్సి వస్తోందని, తాను ప్రత్యక్షంగా ఇవన్నీ చూశానని చెప్పారు.

