కరోనా కష్టకాలంలో పత్తాలేని పలువురు ఎమ్మెల్యేలు.?

కరోనా కష్టకాలంలో పత్తాలేని పలువురు ఎమ్మెల్యేలు.?


వెలుగు, నెట్​వర్క్:  వాళ్లంతా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రజాప్రతినిధులుగా ప్రజల బాగోగులను చూడాల్సినవాళ్లు. కానీ కరోనా బారిన పడి జనం అల్లాడుతుంటే ఆపత్కాలంలో అండగా ఉండాల్సిన టైంలో కొందరు నియోజకవర్గాల్లో పత్తాలేరు. టెస్టుల కోసం, ఆక్సిజన్​ బెడ్ల కోసం, రెమ్డిసివిర్​ఇంజెక్షన్లు, సరైన ట్రీట్​మెంట్​ కోసం, హోం ఐసోలేషన్​లో ఉన్నవాళ్లు రెండుపూటలా తిండి, నిత్యావసర సరుకుల కోసం సఫర్​అవుతుంటే లీడర్లు మాత్రం హైదరాబాద్​కే పరిమితమయ్యారు. ఇంకొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నామమాత్రంగా రివ్యూ మీటింగ్​లకు హాజరై, గప్​చుప్​గా వెళ్లిపోతున్నారు. తరచూ హాస్పిటల్స్​ను విజిట్​చేసి, పేషెంట్ల కష్టాలు తెలుసుకోవడమో, ట్రీట్​మెంట్​ సరిగ్గా అందేలా చూడడమో చేస్తలేరు. హోం ఐసోలేషన్​లో ఉన్న పేదలు తింటున్నారో, పస్తులుంటున్నారో ఎవరూ పట్టించుకుంటలేరు. కొవిడ్​తో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చనిపోయి అనేక కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నా ఓదార్చేందుకు కూడా లీడర్లకు టైం దొరకడం లేదు.

కరోనా కష్టాల్లో పబ్లిక్​

తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5 లక్షలకు పైగా జనం కొవిడ్​బారిన పడ్డారు.  ఆక్సిజన్​ అందక ప్రభుత్వ, ప్రైవేట్​ఆసుపత్రుల్లో కొవిడ్​ పేషెంట్లు మరణిస్తున్నారు. అఫీషియల్​ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 3 వేల మంది కొవిడ్​తో మృతిచెందారు. హోం ఐసోలేషన్​లో ఉండి, అకస్మాత్తుగా ఆక్సిజన్​ లెవల్స్​పడిపోతున్నవారికి సరిపడా బెడ్స్​దొరకడం లేదు. ఇటీవల ఇంటింటా నిర్వహించిన ఫీవర్​ సర్వేలో లక్షన్నర మందికి పైగా ప్రజల్లో కొవిడ్​ లక్షణాలు కనిపించాయి. వాళ్లలో చాలామందికి మెడిసిన్​ కిట్లు అందలేదు. 15 రోజులు హోంక్వారంటైన్​లో ఉండాలని హెల్త్​ స్టాఫ్​ చెప్పి చేతులు దులుపుకొన్నారు. వీళ్లతో పాటు కొవిడ్​ కారణంగా హోం ఐసోలేషన్​లో ఉంటున్న వేలాది పేద కుటుంబాలు.. బియ్యం, కూరగాయలు, ఇతరత్రా నిత్యావసర సరుకుల కోసం అల్లాడుతున్నాయి. తీరా ఇప్పుడు ప్రభుత్వం పదిరోజులు లాక్​డౌన్​ పెట్టడంతో రోజూ కూలి చేసుకొని పొట్టపోసుకునే సామాన్యులు చేతిలో పైసలు లేక ఓ పూట తిని, ఓ పూట పస్తులుంటున్నారు.  

జిల్లాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఇదీ.. 

  • కరీంనగర్ జిల్లాలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​ తదితరులు రివ్యూ మీటింగ్​లకే తప్ప హాస్పిటళ్ల విజిట్, కొవిడ్​ పేషెంట్లకు పర్సనల్​ సాయం చేసిన దాఖలాలు లేవు.  పెద్దపల్లి  ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి 20 రోజులుగా బయట కనిపించడం లేదు. పెద్దపల్లి ఎంపీ బొర్ల కుంట వెంకటేశ్ కూడా నియోజకవర్గంలో జాడ లేరు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు హైదరాబాద్​కే పరిమితయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ 20 రోజులుగా నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఈ నెల 9న కొప్పులకు కరోనా వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. 
  • మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా పేషెంట్లను గాలికి వదిలేశారు. విప్ బాల్క సుమన్ ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అవుతూ అప్పుడప్పుడు జిల్లాకు వచ్చిపోతున్నారు. ఈ నెల 9న మంచిర్యాలలోని ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంట్లో మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. జిల్లాలో కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అంతకుమించి ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదు. -నిర్మల్​ జిల్లాలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కరోనాపై పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్​ పేషెంట్లకు భరోసా కల్పించేలా కనీసం ఒక ప్రకటన చేసింది లేదు.  ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం పర్సనల్​గా ఎవరికి ఎలాంటి సాయం చేయలేదు.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్యేలు రెండు వారాలుగా పత్తాలేరు. కొవిడ్​ పరిస్థితులపై నియోజకవర్గంలో ఎలాంటి రివ్యూలకు అటెండ్​ కాలేదు. సీఎం ఆదేశాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్, హెల్త్ ఆఫీసర్లతో నాలుగు రోజుల కింద కొవిడ్​ పరిస్థితులపై రివ్యూ చేశారు. ఇక మహబూబాద్ ఎంపీ కవిత ఇటువైపు తొంగి చూడలేదు.
  • ఉమ్మడి వరంగల్​కు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​, ఎమ్మెల్యేలు కరోనాపై రివ్యూలు, హాస్పిటల్స్​ విజిట్​లో కాస్త బెటర్​గా ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా కరోనా పేషెంట్లను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
  • నిజామాబాద్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి బుధవారం కరోనాపై రివ్యూ మీటింగ్ నిర్వహించి, గురువారం  జిల్లా హస్పిటల్​తో పాటు బోధన్, ఆర్మూర్​ ఆసుపత్రుల్లోని కరోనా వార్డుల్లో పర్యటించారు.  నిజామాబాద్​ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అడపాదడప కనిపిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా,​ బోధన్  ఎమ్మెల్యే షకీల్​ ప్రస్తుతం అందుబాటులో లేరు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రివ్యూ మీటింగుల్లో పాల్గొంటున్నప్పటికీ పేషెంట్లకు పర్సనల్​గా సహాయం చేసిన దాఖలాలు లేవు.
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కరోనాపై ఇప్పటివరకు ఎలాంటి రివ్యూలో పాల్గొనలేదు. ఇటీవల హుస్నాబాద్ లో కొవిడ్ ఐసోలేషన్ వార్డు  ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆయన క్యాంపు ఆఫీస్​ముందు ధర్నా చేస్తే పోలీసులు కేసు ఫైల్​ చేశారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి అడపాదడపా దుబ్బాకలో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. 
  • మహబూబ్​నగర్​ లోకల్​ఎంపీ, ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీ అధినేత అయిన మన్నె శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. సొంతంగా ఫార్మా కంపెనీ ఉన్నా కొవిడ్​ పేషెంట్లకు అవసరమైన  మందులు, సామగ్రి అందించడం లేదనే విమర్శలున్నాయి. -నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాయచూరులో,  కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్ లో, గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కర్నూల్​లో ఉంటున్నారు.  వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి పాజిటివ్ రావడంతో నెలరోజులు హైదరాబాద్ కే పరిమితమై, ఇటీవలే కొవిడ్​పై రివ్యూ నిర్వహించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి  నెల రోజులుగా ఒక్క ఆస్పత్రిని సందర్శించడం, కరోనా పేషెంట్ల బాగోగులు తెలుసుకోవడం గానీ చేయలేదు.

నియోజకవర్గాల్లో కనిపించని ఎమ్మెల్యేలు 

కరోనాతో జనం కష్టాలు పడుతుంటే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం నియోజకవర్గాల్లో కోట్లు పెట్టి కట్టిన క్యాంపు ఆఫీసుల్లో కాకుండా హైదరాబాద్​లోనే ఉంటున్నారు. చాలాచోట్ల ఆక్సిజన్​ బెడ్లు ఉన్నా వెంటిలేటర్​ సపోర్ట్​ లేక కొవిడ్​ పేషెంట్లు మృతి చెందుతున్నారు. వెంటిలేటర్లు ఉన్నా టెక్నీషియన్లు లేకపోవడమే ఇందుకు కారణం. పలు సర్కారు దవాఖానల్లో రెమ్డిసివిర్​లాంటి ఇంజెక్షన్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు ఆయా హాస్పిటల్స్​ను తరచూ సందర్శించి, అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ రాష్ట్రవ్యాప్తంగా 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఉండగా, పట్టుమని పది మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రులను రెగ్యులర్​గా విజిట్​ చేస్తున్న దాఖలాలు లేవు. ఇటీవల సీఎం చెప్పడంతో నలుగురైదుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు నాలుగైదు రోజులుగా ఆఫీసర్లతో కలిసి రివ్యూలు చేసి వెళ్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో కొవిడ్​పేషెంట్లకు ఎలాంటి సాయం చేయడం లేదనే విమర్శలున్నాయి. 

కష్టకాలంలో చూడాలె కదా 

నమ్ముకున్న లీడర్లు కరోనా కష్టకాలంలో స్పందించిన తీరుతో చాలా బాధ వేసింది. ఏండ్ల తరబడి వారి వెనకాల నడిచిన. ఇప్పుడు కరోనా రావడంతో ట్రీట్మెంట్ కోసం ఒకరిద్దరు లీడర్లను సాయం అడిగిన. ఎవరూ  పట్టించుకోలేదు. చివరికి ఎంజీఎంలో చేరిన. కానీ ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. ఆక్సిజన్ దొరకలేదు. సెలైన్ కూడా సరిగ్గా పెట్టలేదు. చాలా బ్లడ్ పోయింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో కనీసం ఇక్కడైనా మెరుగైన చికిత్స ఇప్పించండని నాయకులకు ఫోన్ చేసి బతిమిలాడిన. కానీ.. ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు.
- కంప వినోద్, వరంగల్

కోనప్ప ప్రత్యేకం 

మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పోలిస్తే కరోనా పేషెంట్లకు సాయం చేయడంలో సిర్పూర్​ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముందు వరుసలో ఉన్నారు. తన నియోజకవర్గంలో కొవిడ్​ కారణంగా హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్న పేషెంట్లు, వాళ్ల అటెండెంట్లకు, హోం ఐసోలేషన్​లో ఉంటున్నవాళ్లకు రెండు పూటలా భోజనం, గుడ్లు, పండ్లు​ అందిస్తున్నారు. భార్య రమాదేవితో కలిసి స్వయంగా ఇంట్లో భోజనం తయారుచేయించి, పార్శిల్స్​చేసి ఇండ్లకు పంపిస్తున్నారు.  గత 20 రోజులుగా ఆరుగురు కూలీలు, 30 మంది అనుచరుల సాయంతో బైకులు, ఆటోల ద్వారా 200 మంది కరోనా బాధితులకు మీల్స్​ చేరవేస్తున్నారు. కరోనా సోకిన పేద కుటుంబాలకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నారు.