లోకల్‌ బాడీలకు నిధులివ్వండి..

లోకల్‌ బాడీలకు నిధులివ్వండి..

హైదరాబాద్, వెలుగు: ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లకు విధులు, నిధులు ఇవ్వాలని పంచాయతీరాజ్‌‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావును ఎమ్మెల్సీ కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కోరారు. బుధవారం మినిస్టర్‌‌ క్వార్టర్స్‌‌లో మంత్రిని కవిత నేతృత్వంలో ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, భూపాల్‌‌రెడ్డి, మహేందర్‌‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌‌ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పురాణం సతీశ్‌‌ కలిశారు. మంత్రి, ఆ శాఖ సెక్రటరీ సందీప్‌‌కుమార్‌‌ సుల్తానియాతో సమావేశమయ్యారు.

లోకల్‌‌‌‌ బాడీ లీడర్లకు సంబంధించిన 16 అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లోకల్‌‌‌‌ బాడీ ప్రజాప్రతినిధులకు నిధులు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థలకు మైనింగ్ నిధులు, సీనరేజ్, స్టాంప్ డ్యూటీ ఇవ్వాలన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలను బదిలీ చేయాలని విన్నవించారు. మండల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లపై ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ పరిధిలోని స్కూళ్లపై జడ్పీటీసీలకు అజమాయిషీ కల్పించాని కోరారు. మండలంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఆఫీస్ వసతి కల్పించాలన్నారు. వచ్చే బడ్జెట్‌‌‌‌లో లోకల్ బాడీ ప్రజా ప్రతినిధులకు నిధులు కేటాయిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడించడంతో అందుకు అనుగుణంగా లోకల్ బాడీ ఎమ్మెల్సీలు  మంత్రితో సమావేశమయ్యారు.