
- వందల ఏండ్ల జానపద సంపద మన సొంతం
- ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నది
ముంబై: ప్రస్తుతం ప్రపంచమంతా కొత్త కథల కోసం ఎదురు చూస్తున్నదని, మన దేశంలో కథలకు కొదవ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో ప్రతి కథకు, ప్రతి పాటకు, ప్రతి శబ్దానికి ఆత్మ ఉంటుందన్నారు. మన కథలను చెప్తే ప్రపంచమంతా మనతో కనెక్ట్ అవుతుందన్నారు. స్టోరీలకే కాదు.. స్టోరీటెల్లింగ్‌లోనూ భారత్ పవర్‌హౌస్ అని చెప్పారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్(వేవ్స్)ను గురువారం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దేశంలోని ప్రతి మూలా కథలతో నిండి ఉంది. ప్రతి పర్వతం పాట పాడుతుంది. ప్రతి నది గేయం ఆలపిస్తుంది. మన దేశంలో ప్రతి పల్లెకూ సొంత జానపద కథలు ఉన్నాయి. అవి చెప్పే విధానమూ ప్రతి ఊరికీ భిన్నంగా ఉంటుంది. ఆ జానపద సంపద వందల సంవత్సరాలుగా తరతరాలకు అందుతూ వస్తున్నది” అని తెలిపారు. మన దేశం ఫిల్మ్ ప్రొడక్షన్, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, మ్యూజిక్, లైవ్ కన్సర్ట్‌లకు ఇంటర్నేషనల్ హబ్‌గా మారుతున్న ఈ తరుణంలో వేవ్స్ వేదిక గ్లోబల్ టాలెంట్ ప్లాట్‌ఫామ్‌గా మారే అవకాశం ఉందన్నారు.
‘‘మన దగ్గర కథలకు కొదవలేదు. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్’కు ఇదే సరైన సమయం” అని పేర్కొన్నారు. ఇండియన్ ఖానా (ఫుడ్)లాగే, ఇండియన్ గానా (పాట) కూడా అంతర్జాతీయంగా పాపులర్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం స్ర్కీన్ సైజ్ తగ్గిపోతున్నప్పటికీ, మన ఓటీటీ కంటెంట్ కు అవకాశాలు మాత్రం అనంతంగా ఉన్నాయన్నారు.
ఎమోషనల్ స్టోరీలు చెప్పండి..
ప్రపంచానికి ఎమోషనల్ స్టోరీలు చెప్పాలని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మనుషులపై టెక్నాలజీ ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానవ బంధాలు, అనుబంధాలు దెబ్బతింటున్నాయి. మనుషులు రోబోల్లా మారే పరిస్థితి తీసుకురావద్దు. మనుషుల్లో సున్నితత్వం పెంపొందించాలి. నేచురల్, సెన్సిటివ్, ఎమోషనల్ స్టోరీలు చెప్పాలి” అని కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. అదే సమయంలో విభజనవాదాలు, హానికార సిద్ధాంతాల నుంచి యువతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘భారత్.. ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుతున్నది. ఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) పరుగులు పెట్టడానికి సమయమొచ్చింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి” అని పిలుపునిచ్చారు.
కంటెంట్ క్రియేటర్లకు ప్రోత్సాహం..
దేశంలోని కంటెంట్ క్రియేటర్లపై తనకు నమ్మకం ఉందని, వాళ్లకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని మోదీ చెప్పారు. అందుకే యంగ్ టాలెంట్‌ను వెలికి తీసేందుకు, వాళ్ల కలలను నిజం చేసేందుకే వేవ్స్ వేదికను ఏర్పాటు చేశామని తెలిపారు. యంగ్ కంటెంట్ క్రియేటర్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘‘వేవ్స్ కేవలం కొన్ని అక్షరాల సమూహం మాత్రమే కాదు.. సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధానం.
క్రియేటివిటీని ప్రోత్సహించేందుకు త్వరలోనే వేవ్స్ అవార్డులను ప్రవేశపెడతాం. వీటిని ప్రతిష్టాత్మక స్థాయిలో అందజేస్తాం” అని ప్రకటించారు. కాగా, సమిట్‌లో భారత్ పెవిలియన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సంగీతం, సినిమా, ఇతర కళాత్మక రంగాల్లో మన దేశం సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారు.
తరలివచ్చిన సినీ ప్రముఖులు..
వేవ్స్ సమిట్ ఈ నెల 4 వరకు జరగనుంది. ఇందులో 100 దేశాల నుంచి 10 వేల మంది డెలిగేట్స్, వెయ్యి మంది క్రియేటర్లతో పాటు 300 కంపెనీలు, 350 స్టార్టప్స్ పాల్గొంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన రుగ్వేద శ్లోకంతో సమిట్ ప్రారంభమైంది. దీన్ని శ్రేయాఘోషాల్ తదితరులు ఆలపించారు. సినీ స్టార్లు షారుఖ్ ఖాన్, అనుపమ్ ఖేర్, హేమా మాలిని, మోహన్ లాల్, రజనీకాంత్, ఎస్‌ఎస్ రాజమౌళి, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరయ్యారు.