న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 2026, ఫిబ్రవరి 12న అమెరికా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్‌లో పటిష్టమైన పాకిస్తాన్‌ను అమెరికా మట్టికరిపించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దాయాదీలు ఈ సారి జాగ్రత్త పడుతున్నారు.
ఈ క్రమంలో పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి అమెరికా తరుఫున ఆడుతోన్న మొహమ్మద్ మొహ్సిన్ మ్యాచుకు రెండు రోజుల ముందే పాక్‌ను హెచ్చరించాడు. సోమవారం (ఫిబ్రవరి 9) ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోసిన్ మాట్లాడుతూ.. 2024 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించామని.. ఈ సారి కూడా ఆ జట్టును మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా క్రికెట్ టీమ్ అప్పటి కంటే ఇప్పుడు ఇంకా పటిష్టంగా ఉందన్నాడు.
2024లో తాను అమెరికా జట్టులో లేనని.. కానీ ఈ సారి టీమ్‌లో తానున్నానని అన్నాడు. గత రెండేళ్లలో యూఎస్ఏ క్రికెట్ జట్టు నైపుణ్యం గణనీయంగా మెరుగుపడిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుత జట్టుకు పాకిస్తాన్‌ను ఓడించే సామర్ధ్యం ఉందన్నాడు. ఫిబ్రవరి 12న జరగబోయే మ్యాచులో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.
పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి.. అమెరికా తరుఫున:
మొహమ్మద్ మొహ్సిన్ పాకిస్తాన్‌లో పుట్టి పెరిగాడు. స్పిన్నర్ అయినా మోహ్సిన్ కెరీర్ తొలినాళ్లలో పాకిస్తాన్ ఎమర్జింగ్ జట్టు తరపున ఆడాడు. పాకిస్తాన్ U19 జట్టు తరపున కూడా ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పెషావర్ జల్మీ తరపున బరిలోకి దిగాడు. చివరగా 2021లో పీఎస్ఎల్ ఆడాడు.
ఆ తర్వాత అమెరికా వెళ్లి ఆ జట్టు తరుఫున ఆడుతున్నాడు. ఇందులో భాగంగానే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై అరంగేట్రం చేశాడు. ఇండియాతో జరిగిన మ్యాచులో మొహ్సిన్ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
