V6 News

నిప్పులు చెరిగిన సిరాజ్.. ఇంట్రెస్టింగ్‌‌గా నాలుగో టెస్ట్

నిప్పులు చెరిగిన సిరాజ్.. ఇంట్రెస్టింగ్‌‌గా నాలుగో టెస్ట్
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు నువ్వానేనా అంటూ ఆడుతుండటంతో ఆట ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌‌ను కొనసాగించిన ఆసీస్.. 294 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వార్నర్ (48), స్టీవెన్ స్మిత్ (55) మినహా ఎవ్వరూ ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్స్‌‌లో సెంచరీ కొట్టిన లబుషేన్‌‌‌‌తోపాటు వేడ్, స్మిత్ లాంటి స్టార్ బ్యాట్స్‌‌మెన్‌‌ను స్పీడ్‌‌స్టర్ సిరాజ్ వెనక్కి పంపాడు. సిరాజ్‌‌తోపాటు శార్దూల్ ఠాకూర్ కూడా రాణించడంతో కంగారూ జట్టు తక్కువ స్కోరుకే తోకముడిచింది. ముఖ్యంగా సిరాజ్ పదునైన లైన్ అండ్ లెంగ్త్‌‌తో నిప్పులు చెరిగాడు. కెరీర్‌‌లో తొలిసారి 5 వికెట్లు సాధించి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ 328 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించింది. కానీ రెండు ఓవర్లు కూడా పూర్తి కాకముందే వరుణుడు మళ్లీ ఆటకు అంతరాయం కలిగించాడు. ఐదో రోజు భారత బ్యాట్స్‌‌మెన్ రాణింపు పైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. మ్యాచ్‌‌ను డ్రా చేసుకోవాలన్నా భారత్ పూర్తి రోజు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వరుణుడు పదేపదే ఆటంకం కలిగిస్తుండటంతో ఆట పూర్తిగా జరగడం కష్టమనే చెప్పాలి.