- బాలుడిని మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లు.. యూపీలోని దేవరియా జిల్లాలో ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లాలో ఒక వింత మోసం వెలుగులోకి వచ్చింది. ఒక బాలుడికి మోమోస్ ఆశ చూపించి మోసగాళ్లు రూ.85 లక్షల నగలను కొట్టేశారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. వారణాసికి చెందిన విమలేశ్ మిశ్రా ఓ ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పన్నెండేళ్ల ఆ బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం. తరచూ తమ ఇంటికి దగ్గర్లోని మోమోస్ స్టాల్ వద్దకు వెళ్లి తింటుండేవాడు. సదరు మోమోస్ స్టాల్ ను ముగ్గురు యువకులు నడిపిస్తున్నారు. తరచూ వస్తున్న ఈ బాలుడిని గమనించారు. మోమోస్ పట్ల బాలుడికి ఉన్న ఇష్టాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు.
బాలుడితో మాటలు కలిపి మోమోస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే, దానికి బదులుగా ఇంట్లో నుంచి ఓ నగ తీసుకొచ్చి ఇవ్వాలని బాలుడికి చెప్పారు. ఆ మోసగాళ్ల ఉచ్చులో పడ్డ బాలుడు.. వారు చెప్పినట్లే ఇంట్లోని నగలను దొంగతనంగా తీసుకెళ్లి వారికి ఇచ్చి మోమోస్ తినేవాడు. ఈ విధంగా లక్షలాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కేటుగాళ్లు కొట్టేశారు. ఒకరోజు విమలేశ్ సోదరి వారి ఇంటికి వచ్చి తనకు నగలు కావాలని అడగడంతో బీరువా తెరిచి చూశారు. అందులో బంగారు ఆభరణాలు లేకపోవడంతో కుటుంబసభ్యులంతా షాక్ అయ్యారు. బాలుడిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మోమోస్ ఫ్రీగా తినడానికి నగలను తీసుకెళ్లి ఇచ్చినట్టు బాలుడు చెప్పాడు. దీంతో ఆ మోమోస్ స్టాల్ నిర్వాహకులు ముగ్గురిపై విమలేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దోచుకున్న నగల విలువ ప్రస్తుతం రూ.85 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
