నైరుతి స్లో..! పశ్చిమం నుంచి వేడిగాలులు.. ముందుకు కదలని మేఘాలు

నైరుతి స్లో..! పశ్చిమం నుంచి వేడిగాలులు.. ముందుకు కదలని మేఘాలు
  • రాష్ట్రంలో విస్తరించేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే చాన్స్​
  • ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం.. ఐఎండీ ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయి. రెండు రోజుల క్రితమే నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినా.. అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. వాయువ్యం నుంచి వీస్తున్న పొడి, వేడి గాలులు.. మేఘాలను ముందుకు కదలనివ్వడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు పశ్చిమగాలుల (వెస్టర్లీస్​)ను బ్లాక్​ చేస్తుండడం వల్ల నైరుతి రుతుపవనాల నార్త్​పాయింట్​ అడ్వాన్స్​ కావడం లేదని, ఈ వేడిగాలుల కారణంగా నైరుతి రుతుపవన ద్రోణి కూడా బలహీనపడిందని అంటున్నారు. 

మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఉపరితల ఆవర్తనాలు కూడా రుతుపవనాలు మందగమనానికి కారణమవుతున్నాయని వివరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణ ఆలస్యమవుతోందని, ఇవి రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు వారమైనా పడుతుందని వెల్లడిస్తున్నారు. కాగా, ఈ నెల 18 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ టైంలో రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మరోవైపు రుతుపవనాలు విస్తరించకపోయినా.. కర్నాటకలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. 

ఎండలు దంచినయ్​..

రుతుపవనాలు కేవలం దక్షిణాదిలోని రెండు జిల్లాలకే పరిమితం కావడం.. వాయువ్యం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టాయి. 19 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో 42.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా సిరికొండ, కరీంనగర్​ జిల్లా రేణికుంట, ఖమ్మం జిల్లా ముదిగొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రవీంద్రనగర్​, మహబూబాబాద్​ జిల్లా పెద్దనాగారం, నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, పెద్దపల్లి జిల్లా పాల్తెంలలో 42.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 

హైదరాబాద్​ సిటీ పరిధిలోనూ దాదాపు అన్ని సర్కిళ్లలోనూ 40 డిగ్రీలకు చేరువగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా మలక్‌‌‌‌‌‌‌‌పేట, రాజేంద్రనగర్​, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో 39.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. కాప్రా, సరూర్‌‌‌‌‌‌‌‌నగర్​, అంబర్‌‌‌‌‌‌‌‌పేట, యూసుఫ్‌‌‌‌గూడ, చందానగర్​, సికింద్రాబాద్, బేగంపేట్‌‌‌‌లో 39.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.