- ఒక్కో ఆటపై నాలుగు రెట్లు పెరుగుదల
- బ్యాడ్మింటన్ కు రూ.50 నుంచి రూ.200
- క్రికెట్‌కు రూ.100 నుంచి రూ.400
- స్విమ్మింగ్‌కు రూ.500 నుంచి 750
- తల్లిదండ్రులు, విద్యార్థుల పెదవి విరుపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లలో క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించి నెలవారీ మెంబర్ షిప్ యూజర్స్ ఛార్జీలను భారీగా పెంచారు. దీనిపై క్రీడాకారులు, విద్యార్థులు, పిల్లలు, యువత, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పెంచడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూన్‌మొదటి తారీఖు నుంచి పెరిగిన ఛార్జీలను వసూలు చేయనున్నారు.
అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, యోగా సహా పలు క్రీడలకు ఇంతకముందు నెలవారీ ఫీజు రూ.50 ఉండగా, దాన్ని రూ.200కు పెంచారు. బ్యాడ్మింటన్‌కు ప్రస్తుతం ఉన్న కోర్టు రకాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1000 వరకు ఉండగా, దీన్ని రూ.1500 చేశారు. క్రికెట్ ఫీజు రూ.100 ఉండగా దాన్ని రూ.400 , లాన్ టెన్నిస్‌కు క్లే కోర్టుకు రూ.450, సింథటిక్ కోర్టుకు రూ.750 ఉండగా రూ.1500గా నిర్ణయించారు. స్కేటింగ్ ఫీజు ఇప్పటివరకు రూ.300 ఉండగా, రూ.400కు, స్విమ్మింగ్ ఫీజు రూ.500 ఉండగా, రూ.750కు పెంచారు.
సమ్మర్ క్యాంపులకూ అంతే..
సమ్మర్ క్యాంప్‌ల కోసం వచ్చే 16 ఏండ్ల లోపు పిల్లల విషయానికి వస్తే చాలా క్రీడలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఫీజులు ఖరారు చేశారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, యోగా ఇంతకుముందు రూ. 50 ఉండగా, వచ్చే సీజన్‌నుంచి రూ.100 చేశారు. బ్యాడ్మింటన్‌కు ఇంతకుముందు రూ.100 ఉండగా, వచ్చే ఎండాకాలం నుంచి రూ. 500 చేశారు. క్రికెట్ ఫీజు రూ.100 ఉండగా వచ్చే వేసవి నుంచి 200 చేశారు. ఇలా పలు క్రీడల రేట్లను పెంచేశారు. సమ్మర్క్యాంప్లకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి పెంచిన ఫీజులు కలెక్ట్ చేయనున్నారు.
మెయింటనెన్స్పెరిగింది...
క్రీడా వసతుల నిర్వహణ ఖర్చులు, కరెంట్బిల్లులు, నిర్వహణ వ్యయం పెరగడంతోనే రుసుములు సవరించాల్సి వచ్చిందని కార్పొరేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, ఒక్కసారిగా భారీ పెంపు కాకుండా దశలవారీగా పెంచి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తగ్గించాలంటున్న పేరెంట్స్..
ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రయార్టీ ఇస్తున్నప్పటికీ ఫీజులు ఒకేసారి ఇంత భారీగా పెంచడమేంటని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. నామినల్ ఫీజులే తీసుకోవాలంటున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించి స్పోర్ట్స్అండ్గేమ్స్నేర్చుకునేవారిలో సాధారణ కుటుంబాల పిల్లలే ఎక్కువగా ఉంటారని, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలంటున్నారు.
ప్రతిరోజూ శిక్షణ పొందే క్రీడాకారులకు నెలసరి ఖర్చులు ఒక్కసారిగా పెరగడంతో ప్రాక్టీస్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు క్రీడలను ప్రోత్సహిస్తామని చెబుతుంటే, మరోవైపు కార్పొరేషన్లు భారీగా ఫీజులు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
